Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టిన రాజగోపాల్‌రెడ్డి చరిత్ర హీనుడు
- ప్రజల గొంతుకై నిలబడిన కమ్యూనిస్టులు : టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి
నవ తెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా చండూరు హైస్కూల్లో శుక్రవారం జరిగిన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సభలో ఆయన ప్రసంగించారు. మునుగోడుకు వస్తుంటే ఎర్రటి స్థూపాలు ఎదురుపడ్డాయని, కమ్యూనిస్టులు ప్రజల గొంతుకై నిలబడ్డారని చెప్పారు. ఇక్కడ కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారం లేకుండా కమ్యూనిస్టులు జనం పక్షాన నిలబడ్డారని చెప్పారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధిలో మల్లు స్వరాజ్యం, బీఎన్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ధర్మభిక్షం, చకిలం శ్రీనివాస్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డితో పాటుగా అనేక మంది కృషి ఉందన్నారు. 2018లో పాల్వాయి స్రవంతికి టికెట్ ఇవ్వాల్సి ఉండగా రాజ్‌గోపాల్‌రెడ్డికి టికెట్ ఇచ్చినా ఆమె పార్టీ కోసం పని చేశారని చెప్పారు. కానీ ఆస్తుల కోసమే, పదవి కోసమో పార్టీ మారలేదన్నారు. చరిత్ర హీనుడు రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా పక్కన చేరారని విమర్శించారు.
సోనియాగాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, ఆమెపై కుట్ర పూరిత నోటీసులిచ్చి ఈడీ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సమయంలో తల్లి పక్కన ఉండాల్సిన కొడుకు శత్రువు పంచన ఎలా చేరతాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయినందున మోడీ పిలిచారని, లేకపోతే గేటుకాడ కుక్క కూడా నిన్ను రానివ్వదని అన్నారు. ఉప ఎన్నికలతోనే అభివృద్ధి జరుగుతుందనుకుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయాలని, పార్టీ టికెట్ ఇవ్వనంటే కదా పక్క చూపులు చూసేదన్నారు. 30 రోజులు జైల్లో ఉన్న తన కింద పనిచేయనంటే.. గుజరాత్లో మారణహోమం సృష్టించి 90రోజులు జైలులో ఉన్న అమిత్‌షా సంగతేంటని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను మోసం చేసిన కోమటిరెడ్డి రేపు మళ్లీ మోసం చేయడని గ్యారేంటని అన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీలు మారితే ప్రజాస్వామ్యం బతకదని చెప్పారు. కమ్యూనిస్టు సోదరులకు, కార్యకర్తలకు విన్నవిస్తున్నా.. కాంగ్రెస్‌కు అండగా ఉండాలని కోరారు. సోనియగాంధీని అవమానపర్చిన సందర్భంగా జరుగుతున్న ఎన్నికలని, గెలిచి తీరాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు చెప్పారు. రాజ్‌గోపాల్‌రెడ్డి లాంటి విశ్వాస ఘాతకున్ని ఎప్పుడూ చూడలేదని, ఆయనను మునుగోడు గడ్డమీద రాజకీయంగా పాతిపెట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు..
నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మునుగోడు ప్రజల విశ్వాసాన్ని ఆయన పోగొట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే జరగని అభివృద్ధి బీజేపీలోకి వెళితే ఎలా జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గానికి జిల్లా నేతలమంతా అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో 12 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రెండు ఎంపీ సీట్లు అందించిన జిల్లా కేవలం నల్లగొండేనన్నారు.
మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపించాలి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇక్కడ అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, మరోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఆనాడు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడితే గెలిపించిన మీకు అండగా ఉన్నామని చెప్పడానికే వచ్చామన్నారు. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు. నల్లగొండ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ అధ్యతన నిర్వహించిన ఈ సభలో కాంగ్రెస్ జాతీయ నాయకులు భోసురాజు, నవీన్జావిద్, మాజీ మంత్రులు జానారెడ్డి, బలరాంనాయక్, చిన్నారెడ్డి, రామిరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సీతక్క, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, పున్నకైలాస్నేత, బెల్లయ్యనాయక్, చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంబం అనిల్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.