Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంటరానితనం దాడులు
- దౌర్జన్యాలు ఆందోళనకరం
- రాజకీయబంధుగా దళిత బంధు
- గోతికాడ నక్కలా సంఫ్‌ుపరివార్
- మతం పేరిట చీలికలు తెచ్చే కుట్ర
- సామాజిక న్యాయమే లక్ష్యంగా కేవీపీఎస్ పోరాటాలు
- మనువాదాన్ని ఎండగడుతూ చైతన్య యాత్రలు
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు పూర్తయినా.. ఆ సందర్భంగా మనం వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నా.. ఇంకా దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై దాడులు దౌర్జన్యాలు ఆవేదన కలిగిస్తున్నాయనీ, అంటరానితనం పలు రూపాల్లో కరాళ నృత్యం చేస్తున్నదని ఆయన వాపోయారు. ఎస్సీలను పలు కారణాలు చెప్పి గ్రామాలనుంచి బహిష్కరించటం ఇప్పటికి కొనసాగుతుండటం సభ్యసమాజానికి సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని బీజేపీ, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా, మనువాదాన్ని ఎండగడుతూ కేవీపీఎస్ నికరంగా నిరంతరంగా పోరాటాలు కొనసాగిస్తున్నదని తెలిపారు. ఆ పోరాటాలను మరింత ద్విగుణీకృతం చేసేందుకు వీలుగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ రాష్ట్ర మూడో మహాసభలను నిర్వహిస్తున్నామని స్కైలాబ్ వివరించారు. మహాసభల నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్నకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు..
కేవీపీఎస్ పోరాటాలకు స్పందన ఎలా ఉంది?
సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరు కేవీపీఎస్ పోరాటాలను అభినందిస్తున్నారు. వాస్తవంగా మా సంఘం లక్ష్యాల్లోనే ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అంశాలున్నాయి. వీటి ఆధారంగా రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తున్నాం. 1998 అక్టోబర్ 2న సంఘాన్ని ఏర్పాటుచేసిన నాటి నుంచి అంటరాని తనం, దళితులపై పెత్తందార్ల దాడులు, దౌర్జన్యాలు, కుల దురహంకార హత్యలు, సాంఘీక బహిష్కరణలకు వ్యతిరేకంగా కేవీపీఎస్ ప్రత్యక్ష ప్రతిఘటనా పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాల్లో మేదావులు, కవులు, కళాకారుల మొదలు..ప్రగతిశీల శక్తులు సైతం కలిసి వచ్చే విధంగా కృషి చేశాం..విజయాలు సాధించాం..
ఇప్పటికీి వివక్ష ఉందంటారా?
ఎందుకు లేదు? కుల అసమానతలు కొనసాగినంత కాలం..దానికి అనుసంధానంగా కుల వివక్ష ఉండటం సహజమే. ప్రేమించి పెండ్లి చేసుకున్నందుకు కులం తక్కువోడనే నెపంతో కన్న తండ్రే అత్యంత హేయంగా సుపారీ హత్యలు చేయిస్తున్న దుర్మార్గాలను చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో నాడు 23జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహిస్తే..58 రకాల వివక్షా రూపాలున్నాయని తేలింది. దళితుడు దేవుని గుళ్లోకి అనుమతించని గ్రామాలెన్నో ఇప్పటికీ ఉన్నాయి. అగ్రకులాల బావుల్లోనుంచి నీళ్లు తోడకోనీయని దుస్థితి కొనసాగుతూనే ఉంది. దళితుడు జమ్మాకు తెంపకూడదు, బొడ్రాయికి నీళ్లుపోయకూడదని ఆంక్షలు పెట్టి అవమానిస్తున్న సంఘటనలు కోకోల్లలుగా ఉన్నాయి. చివరికి చనిపోయిన శవాన్ని కూడా ఊరు మధ్యలో నుంచి తీసుకుపోటానికి వీల్లేదని అడ్డగిస్తున్న హృదయ విధారక సంఘటనలు 75ఏండ్ల వజ్రోత్సవాల కాలంలోనూ జరగటం బాధాకరమే..
కేవీపీఎస్ పోరాటాల వల్ల సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా?
రాష్ట్రంలో అన్ని తరగతుల ప్రజలను ఆలోచింపజేసే విధంగా పోరాటాలు జరిగాయి. హోటళ్లలో రెండు గ్లాసుల విధానం, బావుల్లో నీళ్లు తోడనీయకుండా అడ్డుకోవటం, పెత్తందార్లు ఆక్రమించిన దళితుల భూములను తిరిగి వారి స్వాధీనం చేసుకోవటం తదితర అనేక వివక్షతలకు వ్యతిరేకంగా నాడు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న బీవీ రాఘవులు నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలో సైకిల్ యాత్ర నిర్వహించాం. ఆ సందర్భంగా దళితులను ప్రత్యక్ష పోరాటాల్లో నిలిపి వారికి ఆత్మ స్థైర్యాన్ని కలిగించాం. ఆ తర్వాత.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటయ్యేలా సమరశీల పోరాటాలు కేవీపీఎస్ నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం, కులాంతర వివాహితులకు రూ.2.50లక్షల ప్రోత్సాహకం పెంచుతూ జీఓ నెం12,దళితులకు రెండెకరాల స్మశాన వాటిక స్థలం కోసం జీఓ నెం.1235 సాధన, 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తదితర ఆర్థిక స్వాంతన చేకూర్చే వాటిని కొట్లాడి సాధించుకున్నాం.
కేసీఆర్ ప్రభుత్వం దళితులకు
తగిన న్యాయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది?
అది ప్రచారమే.. సబ్‌ప్లాన్ చట్టానికి అనుగుణంగా దళితులకు పెట్టాల్సిన ఖర్చును దారిమళ్లించింది. ఎనిమిదేండ్లలో రూ. 86వేల కోట్లు కేటాయింపులు చేసి రూ. 55వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు లెక్కలు చెబుతున్నది. ఇందులోనూ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈవీఎం యంత్రాల భద్రతకోసం తదతర ఉమ్మడి కార్యక్రమాలకు సుమారు రూ.16వేల కోట్లు ఖర్చు చేసింది. కేటాయింపుల్లో సగం కూడా ఖర్చు చేయని వైనం కనపడుతున్నది. భూమి లేని దళితుడికి మూడెకరాల భూమిస్తానని ప్రారంభంలో గోల్కొండ కోటపై త్రివర్ణపతాకం సాక్షిగా సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదని సమగ్ర కుటుంబ సర్వే తేల్చింది. జీఓనెం1 ద్వారా ఏడాది 60వేల కుటుంబాల చొప్పున భూమిలేని దళితులందిరి భూములిస్తామని చెప్పారు. ఎనిమిదేండ్ల కాలంలో 6,800 కుటుంబాలకు 16,681 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. 98శాతం మందికి భూములు దక్కలేదు.రాష్ట్రంలో ప్రభుత్వ భూములున్నప్పటికీ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపంతో ఈ పథకం అటకెక్కింది. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కేవీపీఎస్ దీన్ని స్వాగతించింది. ఆచరణలో రాజకీయ లబ్ది చేకూరే విధంగా దీన్ని డిజైన్ చేశారు. టీఆర్ఎస్ అనుయాయులకు అనుకూలంగా గ్రౌండింగ్ జరుగుతున్నది. అధికారుల ద్వారా పంపిణీ జరగాల్సింది పోయి..ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఓ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉంటేనే దళిత బంధు అని బహిరంగంగా మాట్లాడిన వైనం ఈ పథకం అమలు తీరుకు అద్దం పడుతున్నది.
మహాసభల్లో ఎలాంటి కర్తవ్యాలు ఇవ్వబోతున్నారు?
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి 14వరకు సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహిం చాలని పిలుపును ఇవ్వబోతున్నాం. దళితుల, గిరిజనుల, తాడిత పీడిత తరగతుల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని భావించాం. 15న ప్రతి జిల్లా కార్యాలయం ముందు త్రివర్ణ పతాకం ఎగురాయాలని పిలుపునివ్వబోతున్నాం. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందే విధంగా పోరాటాలు నిర్వహిస్తాం. మనువాద విధానానికి వ్యతిరేకంగా సామాజిక చైతన్య యాత్రలు నిర్వహిస్తాం.