Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం..
- అదో భజన మండలి
- ఇవే అంశాలపై ప్రధాని మోడీకి బహిరంగ లేఖ
- 5జీ స్ప్రెక్ట్రం పెద్ద స్కాం..
- కమీషన్లు తీసుకొని ఎన్పీఏలు ప్రకటిస్తున్నారు..
- ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తాం
- అనాధలకు రిజర్వేషన్లు
- మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
నిటి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారింది. 8 ఏండ్లలో అది సాధించిందేం లేదు. రూపాయి విలువ పాతాళానికి పడింది. నిరుద్యోగం పెరిగింది. ద్రవ్యోల్బణం నేలచూపులు చూస్తోంది. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి. సామాన్య ప్రజానీకం అవస్థలు పడుతుంది. గతంలో నిటి ఆయోగ్ చేసిన సిఫార్సుల అమలుకే దిక్కులేదు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్నారు. దాని అజెండా ఎవరు...ఎక్కడ తయారు చేస్తారో కూడా తెలీదు. నిటి ఆయోగ్ తొలి సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పిన మాటలు, రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు ఏవీ అమల్లోకి రాలేదు.
- కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''రాజ్యాంగ స్ఫూర్తి, కో ఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు. అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇవేవీ నిటి ఆయోగ్ సమావేశాల్లో చర్చించే పరిస్థితులు లేవు. అదో భజన మండలిగా మారింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఆ సమావేశాల్లో మాట్లాడేందుకు కేవలం నాలుగు నిముషాల టైం ఇస్తారు. ఎక్కువ సేపు మాట్లాడితే 'బెల్' కొట్టి, ఇక ఆపండి... అని హెచ్చరిస్తుంటారు. లేదంటే వెకిలి నవ్వులు నవ్వుతుంటారు. గతంలోని ప్రణాళికా సంఘం స్థానంలో నిటి ఆయోగ్ ఏర్పడితే, అప్పటికంటే ఇది మెరుగ్గా ఉండాలి. కానీ అంతకంటే ఈ సంస్థ మరీ అధ్వాన్నంగా ఉంది. అందుకే ఆదివారం ఢిల్లీలో జరిగే నిటి ఆయోగ్ సమావేశాల్ని బహిష్కరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం'' అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. శనివారంనాడాయన ప్రగతిభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, నిటి ఆయోగ్‌పై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. వాటి పనితీరును ఆక్షేపించారు. రాష్ట్రాల పట్ల కేంద్రం, నిటి ఆయోగ్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, బయటకు వచ్చి ఏకగ్రీవం అని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలు పేరుతో అడ్డుకుంటామంటే ఎలా? సమాజంలో పేదలు, విధి వంచితులకు చేయూత ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. దాన్నీ వద్దంటారా? 57 ఏండ్లకు పెన్షన్ ఇస్తామన్నాం. రాష్ట్రంలో రూ.2.016 పెన్షన్ 36 లక్షల మందికి ఇస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే విధివంచితులైన వారికి ఆర్థిక సహకారం కోసం జైళ్లు, పోలీసు శాఖల్ని వివరాల్ని అడిగాం. పాత పెన్షన్ కార్డుల స్థానంలో కొత్తవి ఇస్తారు. మొత్తం 46 లక్షల కార్డులు కొత్తవి ప్రింట్ చేసి ఇస్తాం. అలాగే కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికీ ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కిడ్నీ బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే'' అని సీఎం కేసీఆర్ చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయమని అధికారుల్ని ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అనాథ పిల్లల్ని ప్రభుత్వ పిల్లలుగా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. విద్య, ఉద్యోగాల్లోనూ వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇవి కూడా ఉచితాల కిందికే వస్తాయా అని నిటి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయాన్ని ఉచితాలంటూ ప్రచారం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా మాదిరే చేనేత కార్మికులకు కూడా బీమా అమలు చేస్తున్నట్టు చెప్పారు. బతకడమే కష్టమని భావిస్తున్న చేనేత కార్మికులపైనా కేంద్రం జీఎస్టీ వేసిందన్నారు. ''ప్రస్తుతం గాలికి మాత్రమే పన్ను లేదు. అన్నింటికీ పన్ను పడింది. ఇది దౌర్భాగ్య విధానం. మీరివ్వకున్నా, రాష్ట్రాలు ఇస్తామంటే వాళ్ళ కాళ్లు చేతులు కట్టేస్తున్నారు'' అని విమర్శించారు. కేంద్రం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తుందన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ ద్వారా రాష్ట్రాలు బడ్జెట్ కూర్పు చేసుకుంటాయనీ, ప్రభుత్వరంగ సంస్థలు తీసుకునే అప్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాల అప్పులుగా పరిగణిస్తామంటూ మెలిక పెడుతున్నారని ఆక్షేపించారు. దీనిపై నిటి అయోగ్‌లో ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావల్సిన రూ.53వేల కోట్లలో రూ.25వేల కోట్లు కోత విధించారు. విద్యుత్ సంస్థలకు చెందిన 'ఉదరు' స్కీం ద్వారా రూ.12వేల కోట్లు రుణాలు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంది. దాన్ని రీయింబర్స్మెంట్ చేయలేదు. కోత పెట్టారు. దీనిపై మొన్నటి ఢిల్లీలో పర్యటనలో ఓపెన్‌గా చెప్పాం. కోర్టులో కేసు వేస్తామని హెచ్చరిస్తే, అప్పటికప్పుడు రూ.10వేల కోట్లు ఇచ్చారు'' అని సీఎం కేసీఆర్ తెలిపారు. అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలనీ, ఎఫ్ఆర్బీఎమ్ పేరుతో కోతలు విధింపును తొలగించాలని డిమాండ్ చేశారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశ నిర్మాణం ఉంటుందన్నారు. ఫెడరల్ స్ఫూర్తి పాటించాలని చెప్పారు.ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడనీ, ఆయనతో తనకెలాంటి వ్యక్తిగత కక్ష లేదన్నారు. కానీ దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటానన్నారు. దీనికోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలో బలీయమైన ఉద్యమాలు నిర్మిస్తానని చెప్పారు. కేంద్రం పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదనీ, ఉపాధి హామీ కూలీల నెత్తీనోరు కూడా కొట్టే పని కూడా చేస్తున్నారని విమర్శించారు. పాత ప్రభుత్వాల సంక్షేమ చిహ్నాలను చెరిపేసే ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీని పట్టణాలకూ వర్తించమని లేఖలు రాస్తే, పట్టించుకోలేదన్నారు. కేంద్రం నుంచి పరివర్తన ఆశిస్తున్నామన్నారు. పేదలను కొట్టి కార్పొరేట్ గద్దలకు పందేరం చేస్తున్నారని విమర్శించారు. గతంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్‌పై ఇదే బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారనీ, ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్‌లో మీరేం చేశారని ప్రశ్నించారు. ''వేలం ద్వారా రూ.5 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తే, రూ.2 లక్షల కోట్లు మాత్రమే ఎలా వచ్చాయి... అదో పెద్ద స్కాం'' అని ఆరోపించారు. నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) ప్రకటన పెద్ద కుంభకోణమన్నారు. కమీషన్లు తీసుకొని ఎన్పీఏలు ప్రకటిస్తు న్నారని చెప్పారు. పేదల కడుపు కొట్టి, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారనీ, దీనికి తనపై ప్రధానమంత్రికి కోపం వచ్చినా ఆందోళనలు చేస్తానని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్‌కు రాసిన లేఖలో అన్ని అంశాలు ప్రస్తావిస్తూ, తన నిరసనను కూడా వ్యక్తం చేసినట్టు తెలిపారు. మిషన్ కాకతీయ, భగీరధకు నిటి అయోగ్ రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తే, ఆరేండ్లు గడిచినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. పాల ఉత్పత్తులు, చేనేత, స్మశానాలపౖౖెనా జీఎస్టీ విధిస్తారా...ఇంతకంటే అన్యాయం మరొకటి ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. నిటి ఆయోగ్‌కు అనుబంధంగా కమిటీలు వేయమంటే, అదీ చేయలేదన్నారు. దేశరాజధాని ఢిల్లీలో మంచినీళ్లుదొరకట్లేదనీ, మరి నిటి ఆయోగ్ ఏం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ''తాము చెప్పిందే చేయ్యాలి...లేకుంటే మీ పని చూస్తాం'' అనేకాడికి కేంద్రం దిగజారిందని విమర్శించారు. దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతున్నదనీ, పన్ను వసూళ్లలో కేంద్ర, రాష్ట్రాల వాటాలను రాజ్యాంగం స్పష్టంగా నిర్ణయించిందన్నారు. దీన్ని ఉల్లంఘిస్తూ, పన్ను పరిధిలోకి రాకుండా రూ. 14 లక్షల కోట్లు సెస్‌ల పేరుతో రాష్ట్రాల వాటాను ఎగ్గొట్టారని వివరించారు. ఈ అంశాలన్నింటిని పేర్కొంటూ సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీకి శనివారం బహిరంగ లేఖ రాశారు.
ఆరోపణలు సరికాదు : నిటి ఆయోగ్
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిటి ఆయోగ్ స్పందించింది. సమావేశాన్ని బహిష్కరించడం దురదృష్టకరమని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని.. గత ఏడాదిలోనే నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్, సభ్యులు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించారని వెల్లడించింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్రాలకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించామని పేర్కొంది. ఎజెండా తయారీలో రాష్ట్రాలు సహకరించడం లేదన్న ఆరోపణ సరికాదు. నీటి రంగానికి సంబంధించి నాలుగేండ్లలో తెలంగాణ రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ.3,982 కోట్లను కేటాయిస్తే.. దానిలో తెలంగాణ కేవలం రూ. 200 కోట్లు మాత్రమే వినియోగించుకున్నారని తెలిపింది.