Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 373 ఎకరాల సీలింగ్ భూముల కబ్జా
- భూమి విలువ సుమారు రూ.2వేల కోట్లు
- రైతులను పంట చేలకు రానివ్వని కబ్జాదారులు
- పోలీసు బలగాలు, బౌన్సర్లతో కాపలా
- రోడ్డున పడిన 150 కుటుంబాలు
- భూములు పోతే బతికేదెట్టా..!
- చావైనా.. బతుకైనా ఈ భూమిల్లోనే అంటున్న బాధితులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పేదల ఆధీనంలోని సీలింగు భూములపై భూఅక్రమార్కుల కన్ను పడింది. ఆ భూములను కొట్టేసేందుకు పత్రాలు సృష్టించి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. భూమి మాదని రైతులు ప్రశ్నిస్తే పోలీసులు, బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారు. చివరికి భూ కబ్జాదారుడి బెదిరింపులు తాళలేక ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదీ రంగారెడ్డి జిల్లా నాదల్గుల్లో జరుగుతున్న తంతు. 373 ఎకరాలు భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశారు. దాంతో బాధిత రైతులు రోడ్డున పడ్డారు. నాదల్‌గుల్ భూ బాధితులపై ప్రత్యేక కథనం.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో సర్వే నెంబర్ 119/ 613లో శివరాజు బహదూర్‌కు చెందిన 373 ఎకరాల భూమి ఉంది. ఈ సీలింగ్ యాక్టు కింద ఈ భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఈ భూమిని గ్రామంలోని సుమారు 150 నుంచి 200 కుటుంబాలు 70 ఏండ్ల నుంచి సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఇన్నేండ్లుగా ఈ భూమిపై రైతులు ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఆ భూములకు కరెంట్ సరఫరా చేయాలని రెవెన్యూ అధికారులు విద్యుత్‌శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే, ఈ భూములపై తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు కలెక్టర్, ఆర్డీఓకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. కానీ అధికారులు అనుమతి పత్రాలు ఇవ్వలేదు. ఇదే అదనుగా భావించిన భూ అక్రమార్కుడు కరీం అల్లావుద్దిన్ ఈ భూములపై కన్నేశాడు. ఎలాగైనా ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నాడు. అధికారులను, ప్రజాప్రతినిధుల అండతో రైతులను భూముల నుంచి వెళ్లేగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
సాగు చేయకుండా అడ్డగింత
ఈ భూములను శివరాజు బహదూర్ వారసుల నుంచి కొనుగోలు చేశానని కరీం అల్లావుద్దిన్ తప్పుడు పత్రాలు సృష్టించారు. కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. 373 ఎకరాల చుట్టూ కంచె వేసి రైతులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు. రైతులు ఈ భూమి మాదని ప్రశ్నిస్తే పోలీసులు, బౌన్సర్లను పెట్టి దాడులు చేయిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వరి నాటు వేసేందుకు కూలీలతో వెళ్లిన రైతును పోలీసులు అడ్డగించారు. దాంతో ఆ రైతు కుటుంబం అక్కడే కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చావో..రేవో ఈ భూముల్లోనే తేల్చుకుంటామని రైతులు స్పష్టం చేశారు.
రైతులకు డబ్బుల ఎర..
స్థానిక నాయకులతో కలిసి రైతులకు డబ్బులు ఎర చూపి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి సుమారు. రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల ధర పలుకుతోంది. కానీ రైతులకు రూ.5 లక్షలు ఇచ్చి భూములను కాజేసే కుట్రలు జరుగుతున్నాయి. కాదు కూడదంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాప్రతినిధుల అండతో రైతులకు నాయానో.. బయానో ఇచ్చి సుమారు రూ.2 వేల కోట్ల విలువ గల 373 ఎకరాలను కాజేసేందుకు కరీం అల్లావుద్దిన్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి భూ కబ్జాదారునిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
పొలమే ఆదరవు..
70 ఏండ్లుగా ఈ నేలలో పండించిన పంటలతో బతుకుతు న్నాం. ఉన్న ఫలంగా ఈ భూముల నుంచి వెళ్లిపోండి అంటే ఎక్కడికి పోయేది. మా భూములపై భూ అక్రమార్కులు కన్నేసి మమ్మల్ని పంట చేలకు పోకుండా అడ్డుకుంటున్నారు. డబ్బు బలంతో పోలీసులు, రౌడీలతో కొట్టిస్తున్నారు.
- అంకంగారి లక్ష్మమ్మ, నాదర్గుల్
రెక్కల కష్టంతో బోర్లు వేశాం
మా అత్తామామల నుంచి గీ భూముని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రెక్కల కష్టంతో బోరు బావులు తోడించాం. మాకు ప్రభుత్వం కరెంటు ఇచ్చింది. గీప్పుడేమో ఎవరో వచ్చి ఈ భూములు మావి అంటూ.. పొలంలో అడుగు పెట్టకుండా రౌడీలతో కొట్టిస్తున్నారు. మా కుటుంబం బతుకు ఈ భూమిపైనే ఆధారపడి ఉంది. ఈ భూమి పోతే మేమెట్టా బతికేది. ప్రభుత్వమే మా భూములను కాపాడాలి.
- మంత్రి స్వరూప, నాదర్గుల్
భూకబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ఎన్నో ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి భూములు లాక్కునేందుకు యత్నిస్తున్న భూ కబ్జాదారుడు కరీం అల్లావుద్దిన్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అతనికి సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులపైనా చర్చలు తీసుకోవాలి. రైతుల నుంచి సెంట్ భూమి లాక్కోవాలని చూసినా సీపీఐ(ఎం) ఊరుకోదు. బాధితుల పక్షాన భవిష్యత్‌లో పెద్దఎత్తున పోరాటాలు చేస్తాం.
- కాడిగళ్ల భాస్కర్,సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి