Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న వెయ్యిమంది ప్రతినిధులు
- ముస్తాబైన సంగారెడ్డి
- సామాజిక న్యాయమే లక్ష్యంగా ఉద్యమాలకు శ్రీకారం
- కుల, మతోన్మాదాలకు వ్యతిరేకంగా పోరాటాలు
- ముఖ్యఅతిథిగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్, ఎస్ఎంఎం కార్యదర్శి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర మూడో మహాసభలు ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్నాయి. మంగళవారం వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రం నలుమూలనుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్న ఈ సభలకు ముఖ్య అతిథులుగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్, దళిత్ సోషన్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, అభివృద్ధి సంక్షేమం, వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, సామాజిక న్యాయం వంటి అంశాలపైనా చర్చించనున్నారు.
ముస్తాబైన సంగారెడ్డి..
కేవీపీఎస్ రాష్ట్ర మూడో మహాసభలకు సంగారెడ్డి పట్టణం ముస్తాబైంది. ప్రతి కూడలినీ నీలి రంగు జెండాలతో అలంకరించారు. మహాసభ ప్రాంగణమంతా కుల నిర్మూలన, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానీయుల చిత్రపటాలతో పాటు దోపిడి, పీడనకు వ్యతిరేకంగా పోరాడిన అమరుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణానికి 'కులదురహంకార హత్యల్లో బలైన మృతవీరుల నగర'్గా నామకరణం చేశారు. సంగారెడ్డిలో ఆదివారం జరగనున్న బహిరంగ సభకు ముందుగా వెయ్యి మందితో నీలి దండు కవాతు నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రాధాకృష్ణన్, బీవీ రాఘవులు, సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు, జిలా కార్యదర్శి అతిమెల మాణిక్ ప్రసంగించనున్నారు. సోమ, మంగళవారాల్లో ప్రతినిధుల మహాసభను ప్రముఖ సీనియర్ అంబేద్కర్‌వాది జేబీ రాజు ప్రారంభిస్తారు.
భూమి కోసం...
'దళితులకు భూమి దక్కనంత కాలం వారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని జీవించలేరు. దాని కోసం ఐక్య ఉద్యమాలకు సిద్దం కావాలి. రాష్ట్రంలో 17.50శాతం మంది దళితులున్నారు. వీరిలో నూటికి 80శాతం మంది వ్యవసాయ కార్మికులు, పేదరైతులు,అసంఘటిత కార్మికులు, కౌలు రైతులు, ఇతర కార్మికులుగా ఉన్నారు. రాష్ట్రంలో సాగు భూమి 1,64,53,566 ఎకరాలు ఉండగా, అందులో నికర సాగు 1,13,60,528 ఎకరాలు. ఈ భూమిలో దళితులకు కేవలం 2శాతం మాత్రమే భూమి ఉండటం గమనార్హం.భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి భూమి దక్కేంత వరకు భూపోరాటాలకు సిద్దం కాక తప్పదని' జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు ఈ సందర్భంగా చెప్పారు. వీటిపై ఈ మహాసభల్లో చర్చించనున్నారు. దీంతోపాటు దళితులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి మరో 20 తీర్మానాలను ఆమోదించనున్నట్టు వారు వివరించారు. మహాసభల అనంతరం దశవారీ పోరాటాలకు పిలుపునివ్వనున్నట్టు వారు తెలిపారు.
ఏడేండ్ల కాలంలో అనేక ఉద్యమాలు..
దళితుల సాంఘీక బహిష్కరణలకు వ్యతిరేకంగా సంఘం నాయకత్వంలో పలు ఉద్యమాలు జరిగాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక మూలన కుల దురహంకార హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఏడేండ్ల కాలంలో 7,148 ఘటనలు కోర్టుకు రాగా, అందులో 6,677 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2021 సంవత్సరంలోనే 2,290 దాడులు జరిగాయి. సీఎం అధ్యక్షతన ఏర్పడాల్సిన హైపవర్ కమిటీ కోసం ప్రభుత్వం జీఓనెంబర్ 53ను కూడా విడుదల చేసింది. కానీ..ఆ కమిటీని నియమించలేదు. దీంతో దళితుల మీద ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతున్నదని సంఘం నేతలు విమర్శిస్తున్నారు. వారిపై దాడుల సందర్భంలో బాధితులకు అండగా సంఘం నిలబడింది. ఉద్యమాలు నిర్వహించింది. ఈ క్రమంలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పలు రూపాల్లో పోరాటాలు నిర్వహించింది.