Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం ఊసేలేదు
- అటకెక్కిన ఉద్యోగ భద్రత
- కాంట్రాక్టర్ల ఆగడాలు పట్టించుకోని అధికారులు
- ఇదీ రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల గోస
నవతెలంగాణ- సిటీబ్యూరో
రైళ్ల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతున్నారంటే దాని వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం ఉంది. కానీ ఆ కార్మికులకే భద్రత లేకుండాపోయింది. కనీస వేతనం ఊసేలేదు. అధికారుల లీలలు, కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. వేతనం.. హక్కులపై ప్రశ్నించినా.. లేనిపోని సమస్యల్లో ఇరికించి ఉద్యోగం ఊడబీకుతున్నారు. కార్మికులను అన్ని రకాలుగా దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రైల్వే శాఖ అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
హైదరాబాద్‌లోనే 3వేల కార్మికులు
దక్షిణ మధ్య రైల్వే ముఖ్య కేంద్రమైన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ కేంద్రాలతోపాటు 17 ఎంఎంటీఎస్ స్టేషన్లు, చిన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటితోపాటు రైలు నిలయం, సంచాలక్ భవన్, లాలాగూడ వర్క్‌షాపు, మెట్టుగూడ రైల్వే ఆస్పత్రి, డీజిల్‌షెడ్, లోకోషెడ్, హౌస్‌కీపింగ్, పార్సల్ హమాలీ, బాక్స్బార్సు, లోడింగ్, అన్లోడింగ్, కోచ్ క్లీనింగ్, ఎలక్ట్రికల్, ఏసి, లాండ్రీ, ఓబీహెచ్ఎస్, సెక్యూరిటీ, ఆపరేటింగ్, కమర్షియల్, టికెట్ బుకింగ్, ఓహెచ్ఐ, క్రూ తదితర విభాగాల్లో సుమారు 3వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.
హైదరాబాద్ ఏ1 సిటీ కావడంతో కనీస వేతన చట్టం ప్రకారం నాలుగో తరగతి ఉద్యోగులకు 26 రోజులకుగాను రూ.17,238 చెల్లించాలి. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలి. వీక్లీ ఆఫ్, సీఎల్ వర్తింప చేయాలి. కార్మికుని రోజుకి రూ.663 చొప్పున 26 రోజులకు రూ.17,238 నెలకు ఇవ్వాలి. ఇందులో పీఎఫ్, 12 శాతం అంటే రూ.2170, ఈఎస్ఐ 0.75 శాతం అంటే రూ.125 మొత్తం రూ.2170 కటింగ్‌పోను కార్మికునికి బ్యాంకు ద్వారా ప్రతి నెలా 7వ తేదిలోపే రూ.15,148 చెల్లించాలి. దసరా పండుగకు నెల వేతనం బోనస్ ఇవ్వాలి. ఓటీ కింద డబుల్ వేతనం చెల్లించాలి. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. కాంట్రాక్టర్లు ఒక్కో పురుష కార్మికునికి రూ.8వేలు, మహిళా కార్మికులకు రూ.7వేలు చెల్లిస్తున్నారు. పైగా కార్మికులకు సంబంధించిన బ్యాంకు పాస్‌పుస్తకాలు, ఏటీఎం కార్డులను కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకుని వేధిస్తున్నారు.
అదనపు భారం
ఒక్కో కాంట్రాక్టర్ పరిధిలో 100-110 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు రికార్డుల్లో ఉన్నాయి. కానీ 70-80 మందితోనే పనులు చేయిస్తున్నారు. పైగా కాంట్రాక్టర్ మారితే కార్మికులకు ఉద్యోగం ఉంటుందో? లేదో? తెలియని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం ఉండాలంటే రూ.30వేలు చెల్లించాలి. లేకపోతే నెలకు రూ.2వేలు ఇవ్వాల్సిందే. ఎదురు తిరిగినా, ప్రశ్నించినా ఉద్యోగం ఊడిపోతుంది. బేగంపేట, లింగంపల్లితోపాటు 17 ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో కార్మికులకు చుక్కలు చూపిస్తున్నారు. తమ బాధ వర్ణనాతీతమని పలువురు వాపోతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకున్న పాపానపోలేదు.
అధికారులు, కాంట్రాక్టర్లు ములాకత్..
రైల్వే శాఖలో అధికారులు, కాంట్రాక్టర్లు ములాకత్ అయి కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని అధికారులను అడిగితే 'కాంట్రాక్టర్లు కూడా బతకాలి కదా' అంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కార్మికులను దోచుకుని అధికారులు, కాంట్రాక్టర్లు పంచుకుంటున్నారని కార్మికసంఘాల నేతలు చెబుతున్నారు. కార్మికుల సమస్యల గురించి రైల్వే అధికారులు, సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వేతనం చెల్లించాలి
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు చట్ట ప్రకారం కనీసం వేతనం చెల్లించాలి. కార్మికులకు పేస్లిప్, బ్యాంకు ద్వారా వేతనాన్ని ప్రతి నెలా 7వ తేదీన చెల్లించాలి. ఒక్కో కాంట్రాక్టర్ 3-4నెలలుగా కార్మికుల కు వేతనాలు ఇవ్వడం లేదు. ఈ విషయం పై సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలి. బ్యాంకు పాసు బుక్కులు, ఏటీఎం కార్డులు తమ వద్ద పెట్టుకున్న కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి. కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కు లు కల్పించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలి.
- రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం.వెంకటేష్