Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే వాటిపై జీఎస్టీ
- ఇదో అనాలోచిత నిర్ణయం
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేనేత, జౌళిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందనీ, అందుకే వాటిపై జీఎస్టీ వేసిందని రాష్ట్ర మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు విమర్శించారు. ఈ మేరకు శనివారం కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగాన్ని మోడీ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుష్క వాగ్దానాలు-రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తూ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతున్నదని పేర్కొన్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని రాష్ట్రంలోని నేతన్నలకు సహాయం చేస్తే మంచిదని హితవు పలికారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి, చేనేత కార్మికులకు బీజేపీ ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం సహాయం ఎక్కడీ, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ఎటు పోయింది? హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన ఏది?, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీ ఎర్పాటు ఎక్కడీ, పవర్ లూం మగ్గాల అప్ గ్రేడేషన్ కు కేంద్రం నిధుల అంశం ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత పైన జీఎస్టీని రద్దు చేయాలనీ, టెక్స్ టైల్స్ పై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర టెక్స్ టైల్ శాఖకు మంత్రులు మారుతున్నారే కాని తెలంగాణ విజ్ఞప్తులకు మాత్రం సానుకూల స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటిపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో సైతం నిలదీస్తారని హెచ్చరించారు. తెలంగాణ టెక్స్ టైల్-చేనేత రంగానికి చేస్తున్న సహాయం ఏమైనా ఉంటే, అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాటికి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ నేతలను రాష్ట్రంలోని నేతన్నలు నిలదీస్తారని కేటీఆర్ హెచ్చరించారు. నోటి మాటలు కాదు-నిధుల మూటలు ఇవ్వాలి, ప్రకటనలు కాదు- పథకాలు రావాలి, తెలంగాణ టెక్స్ టైల్, చేనేత రంగానికి ప్రోత్సాహం కావాలని పేర్కొన్నారు.
వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగ ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు. తెలంగాణ టెక్స్ టైల్ - చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన వివరాలను తన లేఖలో కేటీఆర్ పొందుపరిచారు. ఎనిమిదేండ్లుగా టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవాలంటూ వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న మెగా టెక్స్ టైల్ పార్క్ ఎక్కడ ఉందో ఇక్కడి ప్రజలకు చెప్పాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. సూమారు రూ.1,552 కోట్ల తో తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలెట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో కేంద్రం తరుపున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే, ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు.