Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన పత్తి, మొక్కజొన్న సాగు
- వర్షాలు తగ్గడంతో పెరుగనున్న ఎరువుల వినియోగం
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భారీ వర్షాల నేపథ్యంలో ఈసారి వరి నాట్లకు ఆలస్యమైంది. ఇతర విత్తనాలు వేసినా వరదలను నష్టం జరిగింది. వరదల నుంచి బయటపడిన రైతులు ఇప్పుడిప్పుడే హన్మకొండ జిల్లాలో ఒకవైపు వరి నాట్లు ముమ్మరం చేశారు. 94 వేల 577 ఎకరాల వరి సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటి వరకు కేవలం 39 వేల 850 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ఈ క్రమంలో ఇప్పటి ఎరువుల వినియోగం కూడా మందకోడిగా సాగింది. వర్షాలు కాస్త తగ్గితే ఎరువుల వినియోగం గణనీయంగా పెరుగనుంది. అదే జరిగితే జిల్లాలో ఎరువుల కొరత ఏర్పడనుంది. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో వున్నా, డీఏపీ ఎరువు 93 టన్నులు మాత్రమే గోదాముల్లో ఉంది. పత్తి సాగు పెరుగుతుందని భావించినా అంచనాలకు భిన్నంగా తగ్గడం గమనార్హం. మొక్కజొన్న సాగును రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించాలని ప్రచారం చేయడంతో గణనీయంగా సాగు తగ్గింది.
అయితే, ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుదినుసు పంటల ఎదుగుదలకు ఎరువులను వినియోగించనున్నారు. హన్మకొండ జిల్లాలో దుకాణాలలోని స్టాకు కాకుండా గోదాములలో యూరియా 8,177 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 900, డీఏపీ 93 మెట్రిక్ టన్నులు గోదాముల్లో వున్నాయి. రెండ్రోజులు వర్షాలు నిలిచిపోతే ఎరువుల వినియోగం పెరుగుతుంది. హన్మకొండ జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 94 వేల 577 ఎకరాలు కాగా, ప్రస్తుతం 39 వేల 859 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మరో వారం, పది రోజుల్లో పెద్ద ఎత్తున వరి నాట్లు పడే అవకాశాలున్నాయి.
గణనీయంగా తగ్గిన మొక్కజొన్న
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి మొక్కజొన్న సాగును గణనీయంగా తగ్గించింది. మొక్కజొన్న సాగు చేయొద్దని, సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. దీంతో సహజంగానే రైతులు మొక్కజొన్న సాగును తగ్గించారు. ఈ వానాకాలంలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 16 వేల 330 ఎకరాలకుగాను 2,321 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.
తగ్గిన పత్తి..
ఈసారి పత్తి సాగు పెరుగుతుందని భావించినా, సాగు విస్తీర్ణం పెరుగకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 17 వేల 307 ఎకరాలకుగాను, 72 వేల 03 ఎకరాల్లో మాత్రమే పత్తిని సాగు చేస్తున్నారు.
పెరగని కందులు, పెసర
కందుల సాధారణ విస్తీర్ణం 2,649 ఎకరాలు కాగా, 221 ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది. పెసర సాధారణ విస్తీర్ణం 331 ఎకరాలు కాగా, 28 ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని మండలాల్లో పత్తి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఆలస్యంగానైనా మళ్లీ ఈ పంటలను తిరిగి సాగు చేసే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖాధికారులు భావిస్తున్నారు.