Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్విట్ ఇండియా స్ఫూర్తితో రేపు ప్రదర్శనలు, సెమినార్లు
- తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజా సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు బాస్కర్, పట్నం రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహరావు, గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ రమణ డీవైఎఫ్ఐ అధ్యక్షులు కోట రమేష్, రైతు సంఘం కార్యదర్శి మూడ్ శోభన్నాయక్తో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకులు ప్రజల బాధల్ని పట్టించుకోకుండా..ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భరించలేనంతగా పెరిగాయని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వేల మంది ప్రజలు కదులుతున్నారని తెలిపారు. తలదాచుకో వటానికి గూడు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఇంత వరకు ఎవరికీ కేటాయించలేదని తెలిపారు. వరంగల్, హన్మకొండ,సూర్యాపేట, వికారాబాద్, మంచిర్యాల లాంటి జిల్లాల్లో పేదలు ప్రభుత్వభూములో గుడిసెలు వేసుకుంటున్నారని చెప్పారు. వారిపై ప్రభుత్వం దమనకాండ సాగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్కారు భూముల్ని రియల్ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుంటుంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వం..పేదలు తలదాచుకునేందుకు గుడిసెలు వేసుకుంటే..వారిపై నిర్భందాన్ని ప్రయోగించటం విడ్డూరంగా ఉందన్నారు. అయిన ప్రజలు పట్టువదల కుండా పోరాటాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇండ్లు, ఇంటి స్థలాలతోపాటు పోడు భూముల సమస్యపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ మూడు నల్లచట్టాల వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం నిర్వహించిన రైతులపై కేంద్ర ప్రభుత్వం 40వేల మందిపై పెట్టిన కేసులను ఇప్పటి వరకు ఎత్తేయలేదని చెప్పారు. చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించలేదని తెలిపారు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని బీజేపీ వక్రీకరిస్తున్నదని విమర్శించారు. ఇది దుర్మార్గ చర్యని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, సెమినార్లు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 14న కాగడాల ప్రదర్శనలు నిర్వహించి, 15న జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. జి నాగయ్య మాట్లాడుతూ రాబోయే కాలంలో భూపోరాటాలు ఉధృతం చేయాలన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలకోసం ఉద్యమించకతప్పదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఆక్రమించక తప్పదని ఆయన హెచ్చరించారు.