Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ మీడియంలోనే 91 శాతం ప్రవేశాలు
- డిగ్రీలో 1.12 లక్షల మందికి సీట్ల కేటాయింపు
- 51 కాలేజీల్లో సున్నా ప్రవేశాలు
- అక్టోబర్ 1 నుంచి తరగతులు
- కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి వెల్లడి
- దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీలో ఆంగ్ల మాధ్యమానికే విద్యార్థులు జై కొడుతున్నారు. దోస్త్ తొలివిడత సీట్ల కేటా యింపులో 90.89 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చేరుతున్నారు. తెలుగు మాధ్యమంలో 8.26 శాతం, ఉర్దూ మాధ్యమం లో 0.84 శాతం, హిందీ మాధ్యమంలో 0.008 శాతం మంది విద్యార్థులకు సీట్లు కేటా యించడం గమనార్హం. రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీ సెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి శనివారం సీట్లు కేటాయించారు. శనివారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడు తూ దోస్త్‌కు తొలివిడతలో 1,44,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ, వారిలో 1,18,898 మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. రాష్ట్రంలో 978 (గురుకులాలు కలిపి) డిగ్రీ కాలేజీల్లో 4,20,318 సీట్లున్నాయని అన్నారు. అందులో 1,12,683 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. చాలా తక్కువ వెబ్ఆప్షన్లు నమోదు చేసిన 6,215 మందికి సీట్లు కేటాయించ లేదన్నారు. మొదటి ప్రాధాన్యతతో సీట్లు పొంది నవారు 86,791 (77 శాతం) మంది, రెండో ప్రాధాన్యతతో సీట్లు పొందిన వారు 25,531 మంది ఉన్నారని అన్నారు. ఆర్ట్స్‌లో 14,825 (13.16 శాతం), కామర్స్‌లో 42,313 (37.55 శాతం), లైఫ్సైన్సెస్లో 26,539 (23.55 శాతం), ఫిజికల్ సైన్సెస్‌లో 23,059 (20.47 శాతం), డీఫార్మసీలో 336 (0.30 శాతం), ఇతర కోర్సుల్లో 5,611 (4.98 శాతం) మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరిం చారు. డిగ్రీలో ఆంగ్లమాధ్యమంలో 1,02,418 (90.89 శాతం), తెలుగు మాధ్యమంలో 9,304 (8.26 శాతం), ఉర్దూ మాధ్యమంలో 951 (0.84 శాతం), హిందీ మాధ్యమంలో 10 (0.008 శాతం) మంది విద్యార్థులు సీట్లు పొందారని చెప్పారు. సీట్లు పొందిన వారిలో అబ్బాయిలు 45,743 (40.59 శాతం), అమ్మాయిలు 66,940 (59.41 శాతం) మంది ఉన్నారని వివరించా రు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 18.82 శాతం అధికంగా ప్రవేశం పొందారని అన్నారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రవేశ పెట్టామన్నారు. 568 మంది దరఖాస్తు చేస్తే 338 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 51 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యా యని వివరించారు. సీట్ల కేటాయింపు వివరా లను విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు ఎస్ఎం ఎస్ ద్వారా పంపించామన్నారు. https: //dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదిం చి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే విద్యార్థులు రూ.500, రానివారు రూ.వెయ్యి చెల్లించి ఆన్లైన్లో ఈనెల 18 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీట్లను రిజర్వ్ చేసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వ, విశ్వవిద్యాల కాలేజీల్లో సీట్లు పొంది ఫీజురీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న వారు సెల్ఫ్‌రిపోర్టింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చేనెల చివరి నాటికి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామని వారు చెప్పారు. అక్టోబర్ ఒకటి నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు.
నేటినుంచి దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్
ఆదివారం నుంచి దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని నవీన్ మిట్టల్, లింబాద్రి ఈ సందర్భంగా వివరిం చారు. ఈనెల 22 వరకు రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి గడువుందని చెప్పారు. తొలివిడతలో సీట్లు రాని విద్యార్థులు, సీట్లు పొందినా వేరే కోర్సు లేదా కాలేజీ మారాలనుకునే వారితోపాటు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 27న సీట్లు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్య క్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, దోస్త్ హెల్ప్‌డెస్క్ కోఆర్డినేటర్లు గజేంద్రబాబు, ఎం విజయరెడ్డి, ఉన్నత విద్యా మండలి పరిశోధన అధికారి డి వసుంధర, సీజీజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ పి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.