Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణతో సహా దక్షిణాదికి
ఐబీ హెచ్చరికలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలపై ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదమున్నదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తాజాగా హెచ్చరికలు చేసింది. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్సవాలకు విఘాతం కలిగిస్తూ దేశంలోని పలు చోట్ల విధ్వంస చర్యలకు ఐఎస్ఐ పేరిట ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్టు ఐబీ తెలిపింది. ముఖ్యంగా, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో విధ్వంస రచనకు ఉగ్రవాదులు వ్యూహ రచన చేసినట్టు ఐబీ అలర్ట్ చేసింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా అన్ని కీలకమైన ప్రదేశాలలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టు రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కీలకమైన సందర్భాల్లో ఐబీ హెచ్చరికలు చేస్తుండటం సహజమేననీ, అయినప్పటికీ తమ జాగ్రత్తల్లో తాము ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలను అప్రమత్తం చేశామనీ, అనుమానిత ప్రాంతాలపై డేగ కన్ను వేసి ఉంచామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వస్తువులు ఎక్కడ కనిపించినా.. వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారమివ్వాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.