Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఆటలు సాగనివ్వం
- మునుగోడులో సత్తా చాటుతాం
- మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం..: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
దేశంలో మతోన్మాద పాలన సాగిస్తున్న బీజేపీని నిలువరించడం కమ్యూనిస్టులకే సాధ్యమవుతుందని, మునుగోడులో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని సీపీఐ(ఎం) తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల సత్తా చాటుతామని చెప్పారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో బుధవారం సీపీఐ(ఎం) మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు బలమైన పునాది ఉందని తెలిపారు. ఈ నియోజకవర్గంలో బలాబలాలను నిర్ణయించే శక్తి కమ్యూనిస్టులకు ఉందన్నారు. అనేక పర్యాయాలు కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి పనులు చేసినట్టు గుర్తు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో బీజేపీ అనూహ్యంగా తెర మీదకు వచ్చిందని తెలిపారు. కానీ, కమ్యూనిస్టుల కేంద్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడానికి గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పరిపాలనతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ విధ్వంస పరిపాలనను ప్రజలందరికీ వివరించి చెప్తామన్నారు. కమ్యూనిస్టుల వారసత్వం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా సాగనివ్వబోమని తెలిపారు. బీజేపీని ఓడించే లక్ష్యంతోనే కమ్యూనిస్టులు ముందుకు వెళ్తాయన్నారు. బీజేపీ మతోన్మాద విధానాలు, ఆర్థిక విధానాల్ని గ్రామ, గ్రామాన ప్రజలకు వివరిస్తామన్నారు. చౌటుప్పల్‌లో ఈనెల 13న మునుగోడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆగస్టు 15న గ్రామ గ్రామాన జాతీయ జెండాలు ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, దొనూరి నర్సిరెడ్డి, పాలడుగు నాగార్జున, నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, ఎండి.పాషా, బండారు నర్సింహ, గంగదేవి సైదులు, దొడ యాదిరెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, నాంపల్లి చంద్రమౌళి, కర్నాటి మల్లేష్, ఏర్పుల యాదయ్య, మిర్యాల భరత్ పాల్గొన్నారు.