Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనర్హులతో నిండిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్
- దాతల రక్తంతో అవకతవకలు
- సమర్థులను సాగనంపుతున్న వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రక్తదాతలు ప్రాణదాతలు. వారు నిస్వార్థ్యంతో ఇచ్చే రక్తం అనేక మంది ప్రాణాలను కాపాడుతుంది. వారి సేవలు వెలకట్టలేనివంటూ ఇటీవల రక్తదాతల దినోత్సవం రోజున రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ వారిని కొనియాడారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవసరంలో ఉన్న పేద రోగులకు అందించడంతో పాటు విపత్తుల సమయంలో సహాయం రెడ్ క్రాస్ సహాయం అందిస్తుందని ఆమె తెలిపారు. అయితే ఇటీవల హైదరాబాద్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో తలసేమియా బాలునికి ఎక్కించిన రక్తంతో హెచ్ఐవీ సోకిందని స్థానిక పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుతో అక్కడ నెలకొన్న లోపాలు ఒక్కొక్కటికి బయటపడుతున్నాయి. సదరు బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న వ్యక్తి మొదలు కింది స్థాయిలో వివిధ కేడర్లలో పని చేస్తున్న సిబ్బంది వరకు అన్ని పోస్టులను అనర్హులతో నింపేశారని సమాచారం. అర్హులు, సీనియర్లు అక్కడ జరుగుతున్న అవినీతి, ఇతర లోపాలపై ప్రశ్నిస్తుండటంతో గత కొన్నేండ్లుగా దాదాపు 18 మందిని సాగనంపారు. ఖాళీ అయిన స్థానాలతో పాటు ఇతర బాధ్యతల్లో దానికి సంబంధించిన కనీస విద్యార్హత కూడా లేని వారితో నడిపిస్తున్నారని వినికిడి.
అక్కడ రక్తపరీక్షలు నిర్వహిస్తున్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కూడా నకిలీ సర్టిపికేట్లతో కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి వారితో స్క్రీనింగ్ చేయించినందునే లోపం జరిగిందని భావిస్తున్నారు. అంతకు ముందు అక్కడున్న సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లను అంతగా అవసరం లేని గడ్డి అన్నారం, పార్సీగుట్ట, బోయినపల్లి, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లోని మెటర్నిటీ సెంటర్లకు పంపించారు. కేవలం తమ అవినీతి సాఫీగా సాగేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. రెండేండ్ల క్రితం ఆర్మీ క్యాంప్ నిర్వహణతో వచ్చిన 1200 యూనిట్ల (12 బ్యాచ్ ల)ను కేవలం ఇద్దరు వ్యక్తులతో ఒక్క రాత్రిలోనే స్క్రీనింగ్ చేశారని విశ్వసనీయ సమాచారం. ఒక్కో బ్యాచ్‌ను స్క్రీనింగ్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులకు కనీసం నాలుగు గంటలు పడుతుందని అంచనా. స్క్రీనింగ్‌లో బ్లడ్ గ్రూప్, హెచ్ఐవీ, హెచ్ బీఏజీఎస్, హెచ్ సీవీ, వీడీఆర్ఎల్, ఎంపీ టెస్టులు చేస్తుంటారు. గతేడాదిలో అప్పటికీ డీఎల్‌ఎంటీ (డిప్లొమో ఇన్ ల్యాబ్ టెక్నీషియన్) పూర్తి కాని వారిని నియమించుకోవడం, వారు రక్తాన్ని అమ్ముకుంటూ పట్టబడటంతో పంపించేసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. అకౌంట్స్ నిర్వహణ కోసం ఎలక్ట్రీషియన్‌ను, స్టోర్ ఇన్ ఛార్జీగా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ను, మందులిచ్చేందుకు ఫార్మాసిస్టుకు బదులుగా డీఎల్ఎంటీని పెట్టి నడిపిస్తున్నారు. ఇదంతా కూడా కేవలం నెలవారీ మాముళ్ల కోసమేనని తెలుస్తున్నది.
ఇక్కడి అవకతవకలపై ఆరోపణలు రావడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. 2020లోనూ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని ప్రయివేటు బ్లడ్ బ్యాంకుకు నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకుంటుంటే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని టాక్. వీటికి తోడు ప్రతి ఏడాది భవనం పునరుద్ధరణ పనులు, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వచ్చే నిధులు తదితర రూపాల్లోనూ అందినకాడికి దోచుకుతింటున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.
దిద్దుబాటు చర్యలేవి?
ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు ఈ అంశంపై సరిగ్గా విచారణ చేయడం లేదని తెలిసింది. జరుగుతున్న అవినీతిలో వారికి కూడా వాటా ఉండటమే దీనికి కారణమని సమాచారం. ఇక్కడి మెడికల్ ఇన్ ఛార్జీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో అవినీతి సొమ్ముతో రూ.మూడు కోట్లతో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించుకున్నట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం నుంచి తలసేమియా రోగుల్లో ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేలు వస్తున్నా, ప్రభుత్వాస్పత్రులకు సైతం అధిక ధరకు రక్తాన్ని అమ్ముకుంటున్నట్టు వినికిడి. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజరు మిశ్రా స్పందించి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, పేద రోగులకు న్యాయం జరుగుతందని భావిస్తున్నారు.