Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా పాఠశాలలకు చేరని పైసలు
- బడులు ప్రారంభమై రెణ్నెల్లు దాటినా స్కూల్ గ్రాంటు రాలే
- ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రభావం
- బహుమతులు, ఇతర ఖర్చుకు నిధులెట్టా...
- ప్రధానోపాధ్యాయులు, టీచర్లపైనే భారం
- ఆలస్యంగా రూ.4.92 కోట్లు మంజూరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నేటి బాలలే రేపటి పౌరులు' అన్నారు మన పెద్దలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్సోవాలు, రాష్ట్ర ప్రభుత్వం 'స్వతంత్ర భారత వజ్రోత్సవాల'ను నిర్వహిస్తున్నాయి. అయితే వాటి నిర్వహణ కోసం పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. హర్ ఘర్ తిరంగా (ప్రతి ఇంటిపై జాతీయ జెండా) ఎగరేయాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చి చేతులు దులుపేసుకున్నారు. ఇంకోవైపు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో ఈనెల 10 నుంచి 22 వరకు రోజువారీగా ఏంచేయాలో కార్యక్రమాల జాబితాను ఇచ్చింది. సంగీతం, మనమహోత్సవం, వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్, రంగోళి, ఆటలపోటీలతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈనెల 22న ముగింపు కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు బహుమతులను ప్రదానం చేయాలని కోరింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు కోసం నిధులను ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వకపోవడం గమనార్హం. ఆలస్యంగా రూ.4.92 కోట్ల నిధులను మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ నిధులు ఇప్పటి వరకు పాఠశాలలకు చేరలేదు. ఇంకోవైపు బహుమతులు, ఇతర ఖర్చులకు పాఠశాల, విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వ్యయం అవుతుందని ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని ఓ ఇంఛార్జి ఎంఈవో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను అడిగారు. ఆ ఎంఈవోపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిం ది. 'ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిం చాలని చెప్తే అది ఎలా చేయాలో తెలియదా?. ఇవన్నీ మమ్మల్ని అడగాలా?'అంటూ ఆమె కోప్పడి నట్టు సమాచారం. పైసలివ్వకపోవడంతో బడుల్లో వజ్రోత్సవ వేడుకలు మొక్కుబడిగా జరుగుతున్నా యన్న విమర్శలు వస్తున్నాయి. వాటిలో చదివే విద్యా ర్థుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తి వెల్లివిరి యడం లేదు. పాలకులు మాటల్లోనే వజ్రోత్సవ వేడు కలు ఘనంగా జరపాలని చెప్తున్నారు తప్ప చేతల్లో పైసా ఇవ్వడం లేదున్న విమర్శలు ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్నది.
సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు కలిపి సుమారు 40 వేల వరకు ఉన్నా యి. వాటిలో 60 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. 26 వేల సర్కారు బడుల్లోనే 20 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో బడులు ప్రారంభమై రెణ్నెల్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్కూల్ గ్రాంట్ ఇంత వరకూ విడుదల కాలేదు. మరోవైపు స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా పాఠశాలలకు నిధులివ్వలేదు. పాఠశాల నిర్వహణ, కరెంటు బిల్లులు, ఇతర అవసరాలకు వంద మందిలోపు విద్యార్థులుంటే రూ.25 వేలు, వందపైన ఉంటే రూ.50 వేలు, 250 మంది కంటే ఎక్కువుంటే రూ.75 వేలు, వెయ్యి మందికిపైగా ఉంటే రూ.లక్ష చొప్పున స్కూల్ గ్రాంటు ఇవ్వాలి. అదీ ప్రభుత్వం ఇంత వరకు విడుదల చేయలేదు.
దీంతో ఆట పాటలు, ఇతర అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బహుమతులు, ఇతర ఖర్చుల భారమంతా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పైనే పడుతున్నది. దీంతో వారు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఉత్సాహంగా, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించేలా నిర్వహించేందుకు ఆసక్తి కనబర చడం లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇంకోవైపు వారికి సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు పడు తున్నారు. చదువులు, ఇతర అవసరాలకు బ్యాంకుల నుంచి తీసుకున్న ఈఎంఐలు, కుటుంబ అవసరాలు తీరాలంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతాలను ప్రభుత్వం చెల్లించాలి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీన జీతాలు వస్తుండడంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. స్కూల్ గ్రాంటు రాక, వజ్రోత్సవాల నిర్వహణకు పైసలివ్వక, జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10 నుంచి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గాంధీ సినిమాను థియేటర్లలో ఉచితంగా చూపిస్తున్నది. ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లి ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుండడం గమనార్హం.
వజ్రోత్సవాలకు రూ.4.92 కోట్లు మంజూరు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఆ నిధులను వినియోగించుకోవచ్చని కోరారు. పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయం, ఆర్జేడీ, డీఈవో, డిప్యూటీఈవో, ఎంఈవో కార్యాలయాలతోపాటు పాఠశాలల్లోనూ ఈ వజ్రోత్సవ వేడుకలను నిర్వహిం చాల్సి ఉంటుంది. 40 వేల పాఠశాలల చొప్పున రూ.4.92 కోట్ల నిధులను కేటాయిస్తే ఒక్కో పాఠశాలకు రూ.1,230 వస్తాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలలకే ఇచ్చినా ఒక్కో స్కూల్‌కు రూ.1,892 చెల్లించాలి. అయితే నిధుల మంజూరుకు సంబం ధించి ఉత్తర్వులు గురువారం వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే సమయమున్నది. ఇంత వేగంగా ఆ నిధులు ప్రతి పాఠశాలకూ చేరుతాయా? అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రెండో శనివారం, ఆదివారం సెలవులు. సోమవారం ఆగస్టు 15. అంటే ఆ నిధులు ప్రభుత్వం ఇచ్చినా పాఠశా లలకు చేరేది కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
వెంటనే ఆ నిధులను పాఠశాలలకు ఇవ్వాలి. : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించా లంటూ ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది. దాన్ని అమలు చేసేందుకు అయ్యే ఖర్చును ప్రస్తావించ లేదు. రూ.4.92 కోట్లు మంజూరు చేస్తే విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ నిధులు పాఠశాలలకు వచ్చే నాటికి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం అయిపోతుంది. హెచ్ఎంలు, టీచర్లు ఖర్చు చేసి క్లెయిమ్ చేసుకోవాలి. అదీ ముందు చెప్ప లేదు. ఇప్పటికైనా మంజూరైన ఆ నిధులను ఏ పాఠ శాలకు ఎంత వస్తాయో విద్యాశాఖ అధికారులు స్పష్ట త ఇవ్వాలి. అప్పుడే హెచ్ఎంలు ఖర్చు చేసేందుకు సిద్ధపడతారు. ముందే నిధులిస్తే వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి వీలుండేది.
ప్రత్యేకంగా నిధులిస్తే బాగుండేది : రాజభాను చంద్రప్రకాశ్, టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు
పాఠశాలల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా ముందే నిధులిస్తే బాగుం డేది. స్కూల్ గ్రాంటు వచ్చినా ఈ కార్యక్రమాల నిర్వ హణ కోసం సర్దుబాటు చేసుకునేందుకు అవకాశము ండేది. గతంలో బడిబాట నిర్వహణకు ప్రతి పాఠశా లకూ రూ.వెయ్యి ఇచ్చేవారు. ప్రస్తుత విద్యా సంవత్స రంలో అదీ ఇవ్వలేదు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహ ణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే బాగుంటుంది. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.