Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో ర్యాలీలు, సంతకాల సేకరణ
- జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరిరూరల్
మూసీ నది ప్రక్షాళన, ఆయకట్టు ప్రాంతంలో గోదావరి, కృష్ణా జలాల సాధన కోసం ఈనెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పోరుయాత్ర నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ చెప్పారు. యాదాద్రి భువనగిరి సుందరయ్య భవన్లో గురువారం ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. 40 సంవత్సరాల కిందట తాగునీటి అవసరాలు తీర్చిన మూసీ నది, ప్రస్తుతం జల కాలుష్యం, ఫార్మా ఇండిస్టీ నుంచి వస్తున్న వ్యర్థ జలాల వల్ల కలుషితంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత నదుల్లో ఒకటిగా నిలిచిందన్నారు. మూసీ నది విషపూరితంగా మారడం వల్ల కొన్ని రకాల చేపలు అంతరించిపోయాయన్నారు. వ్యవసాయం, ఆకుకూరలు విషపూరితంగా మారాయన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో సుమారు 12వేల చిన్న, పెద్ద తరహా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ ప్రదార్థాలు మూసీలో కలవడం వల్ల జనం క్యాన్సర్, చర్మవ్యాధులు, ఒళ్ళు నొప్పులు, తల వెంట్రుకలు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మూసీని శుద్ధి చేశామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అతీగతి లేదన్నారు.
హైదరాబాద్‌లో కొన్ని వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో మూసీ కాలుష్యాన్ని నివారించడం లేదని చెప్పారు. మూసీ నదిలోకి గోదావరి, కృష్ణా జలాలను తీసుకురావాలని కోరారు. వలిగొండ మండలం గోకారం చెరువులోకి ఫీడర్ ఛానల్‌తో నీరు నింపి మినీ రిజర్వాయర్‌గా మార్చాలని, రామన్నపేట మండలానికి గోదావరి జలాలు అందించాలని డిమాండ్ చేశారు. పహిల్వాన్‌పురం చెరువును మినీ రిజర్వాయర్‌గా చేసి వలిగొండ, మోటకొండూర్, ఆత్మకూర్, మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకు నీరు అందించాలన్నారు. భువనగిరి, బీబీనగర్ మండలాలకు బసవపురం వెళ్లే మెయిన్ కెనాల్ ద్వారా వడపర్తి కత్వలోనికి నీరు తెచ్చి సాగు, తాగునీరు అందించాలని చెప్పారు.
పోచంపల్లి మండలానికి గోదావరి జలాలను తీసుకురావాలని, ఫిరంగి నాల వద్ద కాలువను పునరుద్ధరించి, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా పోచంపల్లికి నీరు అందించే చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం నీటిని శామీర్‌పేట చెరువు నుంచి రాంపల్లి, ఘట్కేసర్, ఏదులాబాద్ నుంచి ఫిలాయిపల్లి కాల్వలోకి తీసుకురావాలన్నారు.చర్లగూడెం రిజర్వాయర్ పనులు త్వరతగతిన పూర్తి చేసి, నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు నీరు అందించాలన్నారు. ఆలేరు వాగు నుంచి ప్రవహించే నీరు మూసీలో కలువకముందే ఆనకట్టలు నిర్మించి నీటిని డైవర్ట్ చేసి ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. పై విషయాలపై రిటైర్డ్ ఇంజినీర్స్‌తో రిపోర్టు తయారు చేయించి ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిపారు.
మూసీ కాలుష్య విముక్తి కోసం సీపీఐ(ఎం) పోరు బాటలో భాగంగానే ఆగస్టు 21 నుంచి 28 వరకు గ్రామాల్లో ర్యాలీలు, సభలు, 29, 30, 31 తేదీల్లో లక్ష సంతకాలను సేకరించనున్నట్టు వివరించారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో గ్రామీణ నిరసనలు, సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి, జిల్లా కేంద్రంలో దీక్షలు, చలో కలెక్ట రట్ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సమా వేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు పాల్గొన్నారు.