Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్ళీ మన్నెంలో గోదావరి వరద ఉధృతి
- 52 అడుగులు దాటి ప్రవాహం
- పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏజెన్సీలో గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. వర్షాల జోరుతో గోదావరి ఉప్పొంగుతోంది. భద్రాచలం పట్టణంలో గురువారం ఉదయం 9 గంటలకు 51.90 అడుగుల వద్ద ఉన్న గోదావరి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 52 అడుగులు, సాయంత్రం 6 గంటలకు 52.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అధికారులు ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయగా, 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. వరద ఉధృతితో భద్రాచలం ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద ప్రధాన రహదారి పైకి వరద నీరు రావడంతో భద్రాచలం-దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచాయి. ఇదే మండలంలో సున్నం బట్టి రహదారి పైకి వరద నీరు చేరుకోవడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం జలమయం అయింది. చర్ల మండలం కుదునూరు ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరుకుంటోంది. తాలి పేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రాజెక్ట్ అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలం పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఆంధ్ర పరిధిలోని రాయినిపేట ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరుకోవడంతో భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం గోదావరి కరకట్ట సమీపాన ఉన్న స్నాన ఘట్టాలు, కళ్యాణ కట్ట నీట మునిగాయి. గోదావరి మరింత పెరిగితే మాత్రం మళ్లీ ఏజెన్సీ వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తమై తగు వరద సహాయక చర్యల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు.