Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 10 లక్షల మందికి ఆసరా...
- మొత్తం 46 లక్షల మంది లబ్దిదారులకు నూతన గుర్తింపు కార్డులు
- కోఠి ఈఎన్టి ఆస్పత్రి ఆవరణలో టవర్ నిర్మాణం
- వైద్యారోగ్యశాఖ సముదాయంలో అధునాతన ఆస్పత్రి
- సరోజనీదేవీ కంటి ఆస్పత్రికి నూతన భవనం
- ఖాళీగా ఉన్న 5,111 అంగన్వాడీ టీచర్లు,ఆయాల పోస్టులు భర్తీ
- 21న అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు
- జీవోనెం. 58,59 కింద పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం : రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో 57 ఏండ్ల వయస్సు పైబడిన వారికి కూడా పింఛన్లు అందనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదనంగా మరో 10 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఈ క్రమంలో మొత్తం 46 లక్షల మందికి బార్‌కోడింగ్‌తో కూడిన ఆసరా గుర్తింపు కార్డులను ప్రభుత్వం అందజేయనుంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కొత్త పింఛన్లు, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఆదాయం, నిధుల సేకరణ, వాటి వనరుల సమీకరణ తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న 75 మంది ఖైదీల విడుదలకు మంత్రివర్గం ఈ సందర్భంగా గ్రీన్‌సిగల్ ఇచ్చింది. పెండ్లిండ్లు, శుభకార్యాలకు ఈనెల 21 అనేది చివరి ముహూర్తం కావడం వల్ల ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకుని... ఆ రోజు(ఈనెల 21) నిర్వహించతలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని తీర్మానించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను జీవోనెం.58,59 కింద క్రమబద్దీకరించి, పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఈ సందర్భంగా మంత్రివర్గం ఆదేశించింది. గ్రామకంఠంలో నూతన ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు వీలుగా అధికారులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ క్యాబినెట్ ఆదేశించింది.
ఇతర నిర్ణయాలు
- కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరు. ఆ ఆస్పత్రి ఆవరణలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్టీ టవర్ నిర్మాణం
- సరోజినీదేవి ప్రభుత్వ కంటి దవాఖానాలో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు
- కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు
- ఖాళీగా ఉన్న 5,111 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి ఆదేశాలు
- వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు.
- తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల స్థలం కేటాయింపు.
- షాబాద్‌లో బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు. ఇందుకోసం టీఎస్ఐఐసీకి 45 ఎకరాలను కేటాయించాలని నిర్ణయం