Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి ఎదుగుదలలో సీఎం కేసీఆర్‌ది ప్రముఖ పాత్ర
- ఆయన చిత్రపటానికి రాఖీలు కట్టండి
- ప్రభుత్వ పథకాల మహిళా లబ్దిదారులతో మంత్రి కేటీఆర్ జూమ్ మీటింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. స్త్రీలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తూ సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఎల్లవేళలా సోదరికి అండగా నిలుస్తానని సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతీకే రక్షాబంధన్ అనీ, ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకుని గురువారం ప్రభుత్వ పథకాల మహిళా లబ్దిదారులతో కేటీఆర్ జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. పంద్రాగస్టు నుంచి అర్హులైన మరో 10 లక్షల మందికి ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ హయాంలో పింఛన్ పదిరెట్లు పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 14 లక్షల ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వాస్పత్రుల్లో 50 శాతం వరకు ప్రసవాలు పెరిగాయనీ, మాతాశిశు మరణాల తగ్గింపులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలించిందని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 12,87,588 కుటుంబాలకు లబ్ది చేకూరిందన్నారు. ఆరోగ్య లక్ష్మి కింద 5,18,215 శిశువులకు, 21,58,479 గర్భిణీలకు, 18, 96,844 పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని 4,30,000పైచిలుకు స్వయం సహాయక బృందాలకు అండగా ఉంటూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం తన కోటా తగ్గించుకున్నా అంగన్వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను తాము పెంచామని గుర్తుచేశారు. మిషన్‌భగీరథతో ఆడబిడ్డల కష్టాలు తీరాయన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలను ఏర్పాటుచేసి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. చట్టసభల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును తేవాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక్క ఆడబిడ్డ బాగుంటే సమాజం, కుటుంబం సుభిక్షంగా ఉంటుందనే లక్ష్యంతోనే మహిళా సంక్షేమాన్ని ప్రధాన కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నామన్నారు.