Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల డిమాండ్
నవతెలంగాణ - వీర్నపల్లి
పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు నిలిపివేయాలని దళిత, గిరిజన, బహుజన, విద్యార్థి యువజన ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలో గురువారం అటవీశాఖ అధికారులు పోడు భూముల్లో మొక్కలు నాటుతుండగా పోడు రైతులు అడ్డుకున్నారు. 30ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్లో మొక్కలు నాటడానికి వీళ్లేదని పెట్టిన మొక్కులను తొలగించేందుకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దళిత, గిరిజన, బహుజన, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు పోడు రైతులకు మద్దతు తెలిపి భూముల్లో ప్లాంటేషన్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పోడు సమస్య పరిష్కరించి భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. గతేడాది పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని, గ్రామ సభలు పెట్టించి దరఖాస్తులు స్వీకరించారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూముల సమస్యలను ఒకరి మీద ఒకరు నెట్టేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75ఏండ్ల స్వాత్రంత్ర భారతదేశంలో పేద ప్రజల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, లేకుంటే పోడు రైతుల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోడు రైతులు మాట్లాడుతూ.. 30, 40ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూడటం అన్యాయమన్నారు. మా భూముల్లో మొక్కలు పెట్టొద్దని వేడుకుంటే కేసులు పెడతామని అధికారులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారపు అరుణ్ కుమార్, నరేష్ నాయక్, మల్లారపు ప్రశాంత్, మనోజ్ కుమార్, ఇసంపల్లి కొమురయ్య, నాగరాజు, తిరుపతి, నరేష్, ముత్తావ్వ, పుష్ప, రాజవ్వ, పద్మ, రేనా, డేవిడ్, మురళి, రమేష్, భూమరాజు, సుదర్శన్, సంతు భాస్కర్ పాల్గొన్నారు.