Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతం ఆలాపన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన అన్ని ఇతర ప్రదేశాల్లో సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలనీ, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. దానికోసం జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలనీ, నోడల్ అధికారులను నియమించుకోవాలని ఆదేశించారు. మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా విస్తృత ప్రచారం చేయాలని ఆయన తెలిపారు.
గోల్కోండలో ఏర్పాట్ల పర్యవేక్షణ
గోల్కొండ కోటలో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇక్కడి నుంచి జాతీయ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. నేషనల్ శాల్యూట్‌తో పాటు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని వివరించారు. దీనికి సంబంధించిన రిహార్సల్‌ను ఆయన పరిశీలించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు.
సీఎస్ వెంట ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమరు కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కతిక శాఖ డైరెక్టర్ హరికష్ణ, టీఎస్‌టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.