Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లికి వ్యకాస వినతి
- ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడం అభినందనీయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పని దినాలు పెంచాలనీ, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ వేతనాలను పెంచాలని కోరారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు ప్రమాద బీమ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో 200 రోజుల పనిదినాలు, రూ.600లు వేతనం, మేట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని కోరారు. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కూలీలకు పనిముట్లు ఇవ్వాలనీ, వారందరికీ ఉచిత వైద్యం అందించాలనీ, ఉపాధి హామీలో ఉన్న ఇతర సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.