Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయంగా ఎదుర్కోలేక తమపై
- అసత్యపు ప్రచారాలకు తెరలేపిన టీిఆర్ఎస్
- కెేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకేనా ముఖ్యమంత్రి ..?
- మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
నవతెలంగాణ -మునుగోడు
మునుగోడు ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబానికి మధ్య ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి కేసీఆర్ నిధులు ఇవ్వకుండా నియంత పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన కేసీఆర్.. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకే పరిమితమయ్యాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు నిర్మిస్తే నీటా మునిగిపోయిందన్నారు నల్గొండ జిల్లా ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లయితే ఈపాటికి ఎస్ఎల్బీసీ సొరంగం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయి మునుగోడు, దేవరకొండ ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు ఉపయోగపడేదని తెలిపారు. చింతమడక గ్రామంలో ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షల ఇస్తే రాష్ట్రంలోని ప్రతి నియోజవర్గంలోని ప్రతి కుటుంబానికి అందజేసినట్టే అవుతుందా అని ప్రశ్నించారు. తన రాజీనామాతో రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టి ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న గట్టుప్పల మండలంతో పాటు మరో 12 మండలాలను ప్రకటించారని తెలిపారు. తాను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరుతున్నానని కొంతమంది నాయకులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రచారం చేస్తున్నారని, రాజకీయాల్లోకి రాక ముందు కాంట్రాక్టులు చేశానని, రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నానని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఉన్న శ్రద్ధ, విద్యుత్ సరఫరా చేయడంలో లేదన్నారు. 24గంటలు కరెంట్ అని చెప్పి కనీసం 6గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు సారధ్యంలో ఈనెల 21న మునుగోడు మండల కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. సమావేశంలో పీఎస్సీఎస్ చైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.