Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా ఎస్టీఎఫ్ఐ సంతకాల సేకరణ : చావ రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ విద్యావిధానం-2020ని రద్దు చేసి ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని అమలు చేయాలనీ, జాతీయ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రపతికి సమర్పించే వినతిపత్రంపై దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమాన్ని రాష్ట్రంలో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆ సంఘ కార్యాలయంలో శుక్రవారం ఆయన సంతకం చేసి ప్రారంభించారు. 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం-2020 విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణలను పెంచి పోషించేదిగా ఉందని విమర్శించారు. దాన్ని రద్దు చేసి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామిక, శాస్త్రీయ విలువలతో కూడిన ప్రత్యామ్నాయ విద్యావిధానం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 18 ఏండ్లుగా దేశవ్యాప్తంగా ఎస్టీఎఫ్ఐ, కేంద్ర కార్మిక సంఘాలు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. పై రెండు ప్రధాన సమస్యలను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్టీఎఫ్ఐ దేశవ్యాప్త సంతకాల సేకరణ క్యాంపైన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్టీఎఫ్ఐ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5 వరకు ఉపాధ్యాయుల సంతకాలు సేకరిస్తామని తెలిపారు. తదనంతరం రాష్ట్రపతిని కలిసి సంతకాలతో కూడిన మెమోరాండమ్‌ను అందజేస్తామని తెలిపారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం వెంకటప్ప, ఎ శ్యామ్ సుందర్, ఎ సింహాచలం, పి జగన్నాథ్, కె అశోక్, సీనియర్ నాయకులు ఎంఎకె దత్, డి మస్తాన్‌రావు, కనకప్ప తదితరులు పాల్గొన్నారు.