Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఓడించి తీరుతాం
- మిగతా వామపక్షాలతో కలిసి ముందుకు:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని పీబీ గార్డెన్స్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీని ఓడించి రాజగోపాల్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. దక్షిణ తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, నల్లగొండ ప్రాంతాల్లో బీజేపీ పట్టు సాధించుకోవడం కోసం ఈ ఉప ఎన్నికను అవకాశంగా వాడుకుంటుందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ నిధులు ఇవ్వట్లేదని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారని, బీజేపీలోకి వెళ్తే నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ ఓడిపోతుందనే భయం ప్రారంభమైందన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను మార్చడానికి అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారన్నారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎన్నో గ్రామాల్లో ఎంతో మంది ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది అన్నారు. దేశానికి, దేశ ప్రజలందరికి ముప్పుగా ఉన్న బీజేపీ పరిపాలనను వ్యతిరేకించడానికి గుర్తుగా నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం ఎంతో అవసరముందన్నారు. కేవలం ఒక వ్యక్తి మధ్య రెండు రాజకీయ పార్టీల మధ్య పోటీగా తాము భావించడం లేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరెవరు అభ్యర్థులు, ఎవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాతే రాజకీయ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తామని తెలిపారు. సీపీఐ, ఇతర వామపక్షాలతో కలిసి ఐక్యంగానే ఎన్నికల్లో ముందుకు సాగుతామని స్పష్టంచేశారు. వారితో సంప్రదింపులు ఇంకా పూర్తి కాలేదని, సంప్రదించుకున్న వారం, పదిరోజుల తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రజలు చైతన్యవంతులుగా ఉండి బీజేపీని ఓడించాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ, భువనగిరి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎండీ జహంగీర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, దోనూరి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.