Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్
- వచ్చే నెల నుంచి ప్రారంభం
- వైద్యశాఖలో ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్ ప్రారంభం
- ప్రభుత్వాస్పత్రుల్లో ఇకపై తక్షణమే యంత్రాల మరమ్మతులు : వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గర్భిణులకు పౌష్టికాహారం అందించడం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. సెప్టెంబర్ మాసం నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు కేవలం 30శాతంగా ఉన్నాయనీ, ఇప్పుడవి 66.8 శాతానికి పెరిగాయని చెప్పారు. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తారని తెలిపారు. బతుకమ్మ పండుగ కానుకగా వచ్చే నెల నుంచి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ఇస్తామన్నారు. తొలుత అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమరంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కిట్స్ ఇస్తామన్నారు. దీనివల్ల 1.50 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లతో కూడిన పోషకాహారం అందించి రక్త హీనత తగ్గించడం, హెమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యంమనీ, ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.2 వేలు ఉంటుందని వివరించారు. ఈ కిట్‌ను గర్భిణులకు రెండు సార్లు ఇస్తారనీ, దీనిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్ కిలో- 2 బాటిల్స్, ఒక కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి ఉంటాయని తెలిపారు. దీనికోసం రూ.400 కోట్లు కేటాయించామన్నారు. నూతనంగా ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్‌ను శనివారం ప్రారంభిం చినట్టు చెప్పారు. ఈ పాలసీ తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని యంత్ర పరికరాలను కొన్ని గంటల్లోనే రిపేర్ చేయడం సాధ్యం అవుతుందని వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో కోట్ల విలువైన పరికరాలు ఉన్నాయనీ, వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ (ఏఎమ్‌సీ) అమలు రూ. 17 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అలాగే ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ 88885 26666 తో కాల్ సెంటర్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రూ.5 లక్షలకు పైగా విలువ ఉన్న పరికరాలు 1,020 ఉన్నాయనీ, గతంలో 720 రకాల మందల జాబితా ఉండగా, ఇప్పుడు దాన్ని 843 కు పెంచి, కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించామన్నారు. దీనిలో రూ.100 కోట్లను ఇందులో 100 కోట్లను సూపరింటెండెంట్ల దగ్గరే పెడుతున్నామని తెలిపారు. మందుల నిర్వహణకు ఈ-ఔషధీ, పరికరాల నిర్వహణకు ఈ-ఉపకరణ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. కోవిడ్ కేసులు వస్తున్నందున అర్హులందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ విద్యార్థులను రీ అలోకేట్ చేయమని కేంద్రం నుంచి శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయనీ, మెరిట్ ఆధారంగా మంగళవారంలోగా వారిని సర్దుబాటు చేస్తామన్నారు. మిగిలిన రెండు కాలేజీలకు సర్దుబాటు ఉత్తర్వులు రాగానే వారికి కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.