Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల సంక్షేమ పథకాలపై అక్కసు ఎందుకు?
- ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''ప్రధాని నరేంద్ర మోడీకి దేశ సంపదను పెంచే తెలివి లేదు. దాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసు లేదు'' అని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. పేదల సంక్షేమాన్ని తప్పుపడుతున్న మోడీ, కార్పొరేట్లకు వేలకోట్ల సబ్సిడీలు, రుణమాఫీలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆసలు ఆయన దష్టిలో ఉచితాలంటే ఏమిటో అని ఎద్దేవా చేశారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానమా అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలు అవుతాయా అని నిలదీశారు. మీకు రైతు రుణమాఫీ చేదుగా, కార్పొరేట్ రుణమాఫీ ముద్దుగా ఉంటుందా అని అడిగారు. సామాన్యుల నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుతూ, కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఎలా ఇస్తూ, ఉచితాలు వద్దంటూ చెప్పడం ఏంటన్నారు. ప్రధాని మోడీ హయాంలో రూ. 80 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరిని ఉద్ధరించారని ప్రశ్నించారు. ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారనీ, ఆ మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ అని విశ్లేషించారు. ఆయన హయాంలో భారతదేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించిందని విమర్శించారు. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నామనీ, దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5 శాతం మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. మోడికి ముందున్న 14 మంది ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోడీ ఒక్కరే సుమారు రూ. 80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారని వివరించారు. దేశ వార్షిక రాబడిలో 37 శాతం అప్పులకు వడ్డీలు కట్టడానికే ఖర్చు అవుతున్నదనే కాగ్ నివేదికను ఉదహరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదనీ, కానీ కేంద్ర సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని చెప్పారు. అప్పుగా తెచ్చిన సొమ్మును ఏ వర్గాల కోసం ఖర్చుచేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. ఆ మేరకు పార్లమెంటులో ఏదైనా చట్టం లేదా రాజ్యాంగ సవరణ చేస్తారో దాన్ని కూడా ప్రజలకు చెప్పాలని అన్నారు.