Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రిలే నిరాహార దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యే పొదెం
- సీపీఐ, కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజాపంథా పార్టీల సంఘీభావం
- ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల మద్దతు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దామని ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్ అన్నారు. యుద్ధ ప్రాతిపదికన గోదావరి కరకట్ట పొడిగింపునకు చర్యలు చేపట్టాలని, పోలవరం ముంపుపై నిపుణులతో కమిటీ వేయాలని, ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలుపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1000 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్షలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధిలో సీపీఐ(ఎం) శాసనసభ్యులు కృషి ఎంతో ఉందని, నాపై నమ్మకంతో నన్ను గెలిపించిన మీ అందరి సమస్యల కోసం కృషి చేస్తానని, శాసనసభ్యునిగా అసెంబ్లీలో కొట్లాడతానని, బయట మీరు పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ సీపీఐ(ఎం) అని అన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. భద్రాద్రి రక్షణ కోసం మొక్కవోని దీక్షతో సీపీఐ(ఎం) పోరాడుతోందని అన్నారు. పోలవరం ముంపు నుంచి భద్రాచలం నియోజకవర్గం కాపాడాలని ఆనాడే సున్నం రాజయ్య నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. అమర జీవితం ఉన్న సమయంలో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భద్రాచలం గోదావరి కరకట్ట నిర్మాణంలో కృషి చేశారని, ఆ కరకట్టే నేడు భద్రాచలం పట్టణం తీవ్రంగా నష్టపోకుండా కాపాడిందని గుర్తుచేశారు. కరకట్ట ఎత్తు పెంచి పొడిగించడం ద్వారా భద్రాచలం ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈ రిలే నిరాహార దీక్షలకు సీపీఐ పట్టణ కార్యదర్శి సునీల్, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి కుంచాల రాజారాం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రజాపంధా నాయకులు కెచ్చల కల్పన సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుదర్శన్ రావు, కెమిస్ట్ డ్రగ్ లిస్టు అధ్యక్షులు పరిమి సోమశేఖర్, ప్రసాద్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు నరసింహచారి, లైన్ యోగి సూర్యనారాయణ, పట్టణ ప్రముఖులు ధనేశ్వరరావు, డాక్టర్ యన్.సత్యం, తాళ్లపూడి రాము, లైన్ మాధవరెడ్డి, గ్రీన్ భద్రాద్రి వ్యవస్థాపక అధ్యక్షులు భూపతిరావు, రిటైర్డ్ సంఘం బాధ్యులు భూషణం రావు, ఆల్ ఫించనర్స్ యూనియన్ నాయకులు హరినాథ్ మంగయ్య పాల్గొని తమ మద్దతు తెలిపారు. కాగా, మొదటిరోజు దీక్షలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా, పట్టణ కమిటీ సభ్యులు బి.కుసుమ, వుస్తెల జ్యోతి, జి.లక్ష్మీకాంత్, జీవనజ్యోతి, శాఖా కార్యదర్శులు పట్టణ కమిటీ సభ్యులు కూర్చున్నారు. దీక్షలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, సీనియర్ నాయకులు జిఎస్ శంకర్రావు, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.