Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా రాచలూర్లో మీటర్ లోతులో నీరు
- వరుస వర్షాలతో మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి. సగటు వర్షపాతం కంటే అధికంగా నమోదు కావడంతో నీరు పైకి ఊబికి వస్తోంది. వర్షాలతో కుంటలు, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. దాంతో వరద నీరంతా భూమిలోకి ఇమిడి భూగర్భ జలాలు రెట్టింపు స్థాయికి పెరిగాయి. పంటల సాగుకు పుష్కలంగా నీరు ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచలూరుల గ్రామంలో కేవలం 0.89 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు దర్శనమిస్తున్నాయి. తలకొండపల్లి మండలం వెల్జాల్లో 37.23 మీటర్ల లోతులో నీరు ఊబికి వస్తోంది. జూన్‌తో పోలిస్తే జులైలో జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఫలితంగా కందుకూరు, షాబాద్, కొందుర్గ్, అబ్దుల్లాపూర్‌మెట్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, నందిగామ, హయత్‌నగర్ మండలాల్లో భూగర్భజల మట్టం అనూహ్యంగా పెరిగింది. ఆయా మండలాల్లో 15 అడుగల లోతులోనే పుష్కలంగా నీరు లభిస్తున్నాయి.
ఈ నెలలో పెరిగే అవకాశం ఉంది
చాలా ఏండ్ల తర్వాత జిల్లాలోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఈసీ, మూసీ వాగులతో పాటు అనేక చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. ఈ నీరంతా భూమిలోకి ఇంకిపోవడంతో ఫలితంగా ఆగస్టు చివరి నాటికి భూగర్భజల మట్టం మరింత పైకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏనెరాళ్లతో కూడిన నల్లరేగడి, బురద నేలల్లో వర్షపు నీరు పెద్దగా ఇంకదు. ఆయా ప్రాంతాల్లో భూగర్భ నీటి లభ్యత ఆశించిన స్థాయిలో లభించదు. అదే ఎర్ర ఇసుక నేలల్లో ఆశించిన దానికంటే అధిక పరిమాణంలో నీరు లభిస్తుందని భూగర్భ జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కొంత లోతులో నీరు కన్పిస్తున్నప్పటికీ.. ఎక్కువ మొత్తంలో లభ్యత ఉంటుంది. అదే కొండలు, గుట్టలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో నీరు పెద్దగా ఇంకదు. ఇంకిన నీరు కూడా రెండు, మూడు అడుగుల లోతు వరకే చేరుతోంది. ఇదీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందని అధికారులు తెలిపారు.
తలకొండపల్లిలో అత్యల్పం
తలకొండపల్లిలో భూగర్భజల మట్టం అత్యల్పంగా నమోదైంది. ఈ మండల పరిధిలో భూగర్భజలం ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇతర మండలాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు ఇక్కడ ఉన్న ఇసుక, రాతి నేలలు కూడా ఓ కారణమని భూగర్భ జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 100 అడుగుల (26.85 మీటర్ల) లోతులో నీరు ఉన్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో కడ్తాల్, గండిపేట్, శంకర్పల్లి, మెయినాబాద్, చేవెళ్ల, నందిగామ, ఫరూఖ్‌నగర్ మండలాలున్నాయి. ఇక్కడ సుమారు 25 నుంచి 30 అడుగుల లోతులో నీరు లభ్యమవుతుంది. ఇదిలా ఉంటే శంకర్పల్లి మండలం మియాఖాన్‌గడ్డ గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే బోరు నుంచి నీరు బయటికి రావడం విశేషం. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది
జిల్లాలో భారీగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇదే విధంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా వర్షపాతం నమోదైతే మరింత భూగర్భ జలాలు పెరుగుతాయి. రాబోయే రెండు సీజన్లకు సరిపడా సాగునీరు భూగర్భంలో ఇమిడి ఉంది.
- రఘుపతిరెడ్డి, జిల్లా భూగర్భజలవనరుల శాఖ అధికారి