Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు బడుల్లో విద్యార్థుల ఎదురుచూపు
- పాత, సాధారణ దుస్తులతోనే హాజరు
- 26 లక్షల్లో కేవలం 5 లక్షల మందికి ఒకజత అందజేత
- పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలూ ఇవ్వని ప్రభుత్వం
- ఇప్పటి వరకు 80 శాతం పంపిణీ
- టెండర్ల నుంచే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బడులు ప్రారంభమై రెణ్నెల్లు దాటినా విద్యార్థులు ఇంకా సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. కనీసం పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ఇంకోవైపు సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తున్నది. అంటే చదువుకోవడానికి పుస్తకాలు అందుబాటులో లేవు, పాఠాలు చెప్పేందుకూ పంతుళ్లూ సరిపోయినంత మంది లేరు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించలేని పరిస్థితి దాపురించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఎనిమిది నుంచి 22 వరకు 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలు' జరుపుతున్నది. ఇంత విశేషమైన ఘట్టం ఆవిష్కృతమవుతున్న సందర్భంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వలేదు. దీంతో పంద్రాగస్టు వచ్చినా పాత యూనిఫారాలు, సాధారణ దుస్తులతోనే పాఠశాలలకు విద్యార్థులు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. యూనిఫారాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల టెండర్ల ప్రక్రియ నుంచే పాఠశాల విద్యాశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. అందుకే వాటి పంపిణీ ఆలస్యమవుతున్నది. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇబ్బందులు తప్పడం లేదంటూ ప్రభుత్వానికి మరక అంటుతున్నది.
అమలుకు నోచుకోని అధికారుల హామీ
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం జూన్ 13 నుంచి ప్రారంభమైంది. పాఠశాలలు తెరిచిన వెంటనే పాఠ్యపుస్తకాలు, రెండుజతల యూనిఫారాలను విద్యార్థులకు అందించాలి. పాఠశాలల్లో చదువుకునే వాతావరణం కల్పించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26,79,497 మంది విద్యార్థుల రెండు జతల యూనిఫారాలను పంద్రాగస్టు నాటికి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. వారిలో ఎక్కువ మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నారు. అందుకనుగుణంగా 26,79,497 మంది విద్యార్థుల కోసం 1.50 కోట్ల మీటర్ల బట్ట కావాలని టెస్కోతో విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. మొదటి జత యూనిఫారాలను గతనెల 15 నాటికి, రెండో జత యూనిఫారాలను ఆగస్టు 15 నాటికి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 5,533 పాఠశాలల్లోని 10,23,519 మంది విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతలో యూనిఫారాలు అందించాలని నిర్ణయించింది. లక్ష్యం నిర్దేశించుకున్నా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉందని అర్థమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కేవలం ఐదు లక్షల మంది విద్యార్థుల వరకు ఒక జత పంపిణీ చేసినట్టు తెలుస్తున్నది. మిగిలిన 21.79 లక్షల మంది విద్యార్థులకు ఒక్కజత బట్టలు సైతం ఇవ్వలేదు. ఇక పుస్తకాలకు సంబంధించి రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కలిపి 26 లక్షల వరకు విద్యార్థులకు 2.10 కోట్ల ఉచిత పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 80 శాతం వరకు పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులవి పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించలేదని నవతెలంగాణ పరిశీలనలో తేలింది. అంటే ఆరో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇచ్చారు. ఇంకా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పుస్తకాలు ఇవ్వాలి. ఏడో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ మినహా మిగిలిన పుస్తకాలు ఇవ్వలేదు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు బయలాజికల్ సైన్స్ పుస్తకం మాత్రమే ఇవ్వాల్సి ఉన్నది. పదో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్, సోషల స్టడీస్ పుస్తకాలు ఇవ్వాలి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ద్విభాష (తెలుగు, ఇంగ్లీష్)లో పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్న విషయం తెలిసిందే. రెణ్నెల్లు దాటినా పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించకపోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఏమీ ఇవ్వకుండా విద్యాసంవత్సరం ప్రారంభం : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
పాఠశాల నిర్వహణ గ్రాంటు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తులు ఏమీ ఇవ్వకుండా విద్యాసంవత్సరం ప్రారంభించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుతుంది. సర్కారు బడుల్లో పారిశుధ్య కార్మికుల్లేరు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా తీర్చడం లేదు. అవసరమైన చోట విద్యావాలంటీర్లను నియమించడం లేదు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
దుస్తులు ఎందుకు అందించలేదు : ముత్యాల రవీందర్, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలు జరుపుకోవడానికి విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఎందుకు అందించలేకపోయిందో సమాఆధానం చెప్పాలి. ఒకవైపు 25 వేలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నా, అసర్, న్యాస్ నివేదికలు ప్రభుత్వ వైఫల్యాలనీ, విద్యారంగంలో కొరవడుతున్న పర్యవేక్షణ లోపాలని తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం ఇంకా మేల్కొనక పోవడం భావి భారత పౌరులకు తీరని అన్యాయం. ఇవన్నీ వజ్రోత్సవాల సందర్బంగానైనా సమీక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాలి : ప్రేమ్‌సాగర్, టీటీసీ ప్రధాన కార్యదర్శి
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను విద్యార్థులకు అందించాలి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకపోవడం శోచనీయం. జూన్‌లో నిర్వహించిన బడిబాటలో, ప్రయివేటు నుంచి సుమారు 50 వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే, వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల, వాళ్లు తిరిగి ప్రయివేటుకు వెళ్లే ప్రమాదముంది.