Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ తర్వాత దేశభక్తి గురించి మాట్లాడండి...
- అగ్నిపథ్‌ను రద్దు చేసేంతవరకు సమరశీల ఐక్య ఉద్యమాలు
- ' జై జవాన్ -జై కిసాన్' సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశభక్తి గురించి, జాతీయ పతాకం గురించి పదేపదే మాట్లాడుతున్న ప్రధాని మోడీ, బీజేపీ నేతలు ముందు సైనిక రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలని పలువురు వక్తలు హితవు పలికారు. ఆ తర్వాతే దేశం గురించి, దేశభక్తిగురించి మాట్లాడాలంటూ వారు ఎద్దేవా చేశారు. అగ్నిపథ్‌ను రద్దుచేసేంత వరకు సమరశీల ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా, విద్యార్థి, యువజన సంఘాలు, మాజీ సైనికుల ఆధ్వర్యంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా 'జై జవాన్-జై కిసాన్' సభను నిర్వహించారు. టి సాగర్ అధ్యక్షతన జరిగిన సభలో వల్లపు ఉపేందర్‌రెడ్డి, జక్కుల వెంకటయ్య, ఏఐకెేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ ... దేశ భద్రతకు, రైతాంగానికి, యువతకు ముప్పు తెచ్చే అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందనీ, వాటి రద్దుకు ఏడాది పాటు పోరాడి 750 మంది ప్రాణాలు బలిదానం చేశారని గుర్తుచేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని హామీని తుంగలో తొక్కిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం విద్యుత్ సవరణ బిల్లును తీసుకొస్తున్నదని ఆరోపించారు. విద్యుత్ వినియోగదారులపై తీవ్రమైన భారాలు పడతాయని చెప్పారు. చివరకు రక్షణ రంగంలో కూడా కాంట్రాక్టు పద్దతిని ప్రవేశపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దేశ రక్షణకు మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చినతర్వాత స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క మాజీ సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారికిచ్చే గౌరవంలోనూ వివక్ష కొనసాగుతున్నదని వాపోయారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల కేంద్రాల్లో జై జవాన్- జై కిసాన్ సభలు జరుగుతున్నాయనీ, భవిష్యత్తులో జరిగే ఆందోళనల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, ఎఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్, ఎఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె మురళి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు మాజీ సైనికులు వసంత్ కుమార్, సుందరం, ఆర్ఎస్ నాయక్, రామకృష్ణ, పద్మనాభం, మహబూబ్అలీ, సురేష్ కుమార్, సోషల్ వర్కర్ కృష్ణానాయక్ మాట్లాడుతూ... తమకు కనీస సౌకర్యాలు కల్పించటంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలో చనిపోయిన వారి భార్యలకు కూడా కనీస వసతులు కల్పించటం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఉపాధ్యక్షులు విజరు కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, కేవీపీఎస్ నాయకులు విజయ్, టీపీఎఫ్ నాయకులు రాంబాబు,ఎఐడీఎస్ఓ నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.