Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ ఖమ్మం జిల్లా సదస్సులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-గాంధీచౌక్
భారత దేశంలో భూస్వామ్య భావజాలం విద్య వ్యవస్థపై తీవ్రంగా ఉందని, భూస్వామ్య భావజాలమే నేడు మోడీ, అమిత్ షా అమలు చేస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. స్వాతంత్య్రోద్యమ వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం జిల్లా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా '75 ఏండ్ల స్వతంత్ర భారతం- విద్యారంగ పరిస్థితులు' అంశంపై నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్సీ నర్సింరెడ్డి పాల్గొని మాట్లాడారు. భూస్వామ్య వ్యవస్థ ఉన్న అన్ని దేశాల్లో విద్యా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. స్వతంత్ర వజ్రోత్సవ ఫలాలు ఆదానీ, అంబానీ, టాటా బిర్లా మాత్రమే మెండుగా అనుభవిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు మౌనంగా ఉంటున్నారంటే వారు తమ హక్కులను కోల్పోతున్నట్టే లెక్క అని అన్నారు. ఒకనాడు చీకటి వ్యాపారాలు చేసే వారు మాత్రమే మౌనంగా ఉండేవారని, నేడు ఉపాధ్యాయులు కూడా ఉంటూ భయపడటం సమాజానికి, విద్యా వ్యవస్థకు మంచిది కాదని స్పష్టంచేశారు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని, ఏ ఒక్క ఉపాధ్యాయుడు గాని, ప్రజలు గాని అడగకపోవడం శోచనీయమన్నారు. ప్రజలే నిజంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నింపాలని అడిగితే సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని చెప్పారు.
మధ్యాహ్న భోజనం రేట్లు పెంచి నాసిరకం భోజనం పెడుతున్నారని, ఈ నిర్వాహకాన్ని కూడా కొంతమంది ఉపాధ్యాయులు ప్రశ్నించకపోవడం సరికాదన్నారు. విద్యా రంగాల్లో ఉన్న అనేక సంఘాలను ఈ ప్రభుత్వం మింగేసిందని, మిగిలింది ఒకే ఒక్క యూటీఎఫ్ అని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిపై ఉందని తెలిపారు. రాజకీయాల్లో మార్పులు సహజమేనని, కానీ ఈ ప్రభుత్వాలు కాకులను కొట్టి గద్దలకు వేస్తుందని విమర్శించారు. విద్యారంగం అభివృద్ధి చెందాలంటే అభ్యుదయ పోరాటాలే శరణమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని, కార్యదర్శి నర్సింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షమీ, జిల్లా కోశాధికారి వాళ్లంకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.