Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని స్మరించుకునే సందర్భం ఇదే..
- దేశంలో రాజకీయ పార్టీలన్నీ వజ్రోత్సవాలు నిర్వహించడం మంచి పరిణామం
- 'స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర'పై సెమినార్లో.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-సంగారెడ్డి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో దేశ ప్రజలంతా పాల్గొనాలని, స్వతంత్య్రోదమ వారసత్వాన్ని స్మరించుకునే సందర్భం ఇదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర'పై శనివారం నిర్వహించిన సెమినార్కు వీరయ్య హాజరై మాట్లాడారు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ వజ్రోత్సవాలను పోటీ పడి నిర్వహించడం మంచి పరిణామమన్నారు. స్వాతంత్రోద్యమంలో ఏ పాత్ర లేకపోగా.. బ్రిటిష్ వారికి తోడ్పాటునందించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ.. వజ్రోత్సవాల గురించి మాట్లాడటం హాస్పాదంగా ఉందన్నారు. ఒకవైపు ప్రజాస్వామ్య లౌకిక విలువలను కాలరాస్తూ స్వతంత్ర సంప్రదాయాలను మంట కలుపుతున్న తమ చర్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ వజ్రోత్సవాలు జరుపుతున్నారని విమర్శించారు. నూతన తరాలు ఈ విషయాలను అర్థం చేసుకొని దేశ సంప్రదాయతను, లౌకిక విలువలను కాపాడుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద పోరాట అనుభవాలను, చారిత్రక వాస్తవాలను కొత్త తరానికి అందించాల్సిన సమయమిదేనని తెలిపారు. జాతీయోద్యమంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను నేడు మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. అందులో భాగంగానే కార్మిక కోడ్లను తీసుకొచ్చిందన్నారు. సామాజిక న్యాయం ఉండాలన్నా, ఉచిత విద్యా వైద్యం వంటి సౌకర్యాలు అందాలన్నా రాజ్యాంగం ద్వారానే సాధ్యమని స్పష్టంచేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో తయారుచేసుకున్న అలాంటి రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి కాపాడుకోవడమే అందరి కర్తవ్యమన్నారు. మోడీ పాలనలో ఉప్పుతోపాటు పాలు, పెరుగు, నిత్యావసర వస్తువులన్నింటిపై పన్నులు వేస్తున్నారని, చివరికి అంత్యక్రియలపై కూడా జీఎస్టీ వేయడం దుర్మార్గమని చెప్పారు. బీజేపీ పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛ, కార్మిక కర్షకుల హక్కులకు ప్రమాదం ఏర్పడిందని, వాటి రక్షణ కోసం మరో స్వాతంత్ర సంగ్రామం చేయాలని పిలుపునిచ్చారు. సెమినార్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి జయరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేష్, రాజయ్య, మాణిక్, నాయకులు ప్రవీణ్, నర్సింహులు, యాదవరెడ్డి, అర్. శ్రీనివాస్, మాధవి, చిరంజీవి, విద్యాసాగర్, నాగేశ్వర్ రావు, ప్రసన్న, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.