Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, ప్రజాస్వామిక హక్కులకై నినదిద్దాం
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సోమవారం జాతీయ జెండాలను ఎగురేయాలనీ, లౌకిక, ప్రజాస్వామిక హక్కులకై నినదించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆవాజ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని మతోన్మాద శక్తులు ఆ చరిత్రను వక్రీకరించేందుకు కుట్రలు పన్నాయని విమర్శించారు. ఘనమైన స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని నేటి తరాలకు తెలపటానికి 75 వసంతాల వేడుకలు మంచి సందర్భమని చెప్పారు. ఉప్పు పై పన్నేసిన బ్రిటీషువారిపై మహాత్మా గాంధీ అధ్వర్యంలో 1932లో ఉప్పు (దండి) సత్యాగ్రహం చేసిన చరిత్ర ప్రజలకు ఉందన్నారు. నేటి పాలకులు ఉప్పు తోపాటు పాలు, పెరుగు, నిత్యావసర వస్తువులన్నింటిపై పన్నులు వేస్తున్నారనీ, చివరకి అంత్యక్రియలపై కూడా జీఎస్టీ వేయటం దుర్మార్గమన్నారు. నాడు క్విట్ ఇండియా ఉద్యమంతో వలస పాలకులను తరిమేస్తే, నేడు విదేశీ వస్తువులను, విదేశీ కంపెనీలకు ప్రభుత్వం ఎర్ర తివాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నదని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటానికి వెన్నుపోటు పొడిచి, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసిన వారే, నేడు స్వాతంత్య్రం తామే తెచ్చినట్టు బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. ఆ సంగ్రామంలో ముస్లింల పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. అనేక మంది ముస్లింలు ఆజాదీ కోసం ఆనందంగా ఉరి కంబాన్ని ముద్దాడారన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర గురించి, హిందువులు, ముస్లింలు ఐక్యంగా సాగించిన పోరాటం గురించి ప్రచారం చేయాలని కోరారు. బీజేపీ పాలనలో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ , సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థ, కార్మిక కర్షకుల హక్కులకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి రక్షణ కోసం మరో స్వాతంత్య్రం సంగ్రామం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశా నికి రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ నబి అధ్యక్షత వహించగా.. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జబ్బార్, అజీజ్ అహమ్మద్ ఖాన్, అతిఖుర్ రెహమాన్, లతీఫ్, సహయ కార్యదర్శులు మహమ్మద్ అలీ, జహంగీర్, రహీమ్ ఖాన్, కోశాధికారి షేక్ అబ్దుల్ సత్తార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఖలీమ్, నశీర్ అహ్మద్, ఇక్బాల్, ఖాజా, సలీం తదితరులు పాల్గొన్నారు.