Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రంతా రాష్ట్రమంతా సాంస్కృతిక ప్రదర్శనలు
- హైదరాబాద్‌లో ఎస్వీకే వద్ద కార్యక్రమం
- తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకా... కార్పొరేట్లకా?అని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ప్రశ్నిస్తున్నది. అందులో భాగంగానే ఆదివారం 'జనమేల్కొలుపు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాష్ట్రమంతా అన్ని జిల్లా కేంద్రాలు, మండలాలు, కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాటికలు, పాటలు, బృందగానాలు, కవితాగోష్టులు, నృత్యాలు, స్కిట్లు, ఏకపాత్రాభినయాలు, ప్రజాసంఘాల ముఖ్య నాయకుల ప్రసంగాలు కూడా ఉంటాయి. ఆదివారం రాత్రంతా 'మేల్కొందాం, నిలదీద్దాం, ప్రశ్నిద్దాం, ధూందాం చేద్దాం'అని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, స్వాతంత్య్ర ఫలాలు ఎవరికి అందుతున్నాయనే అంశాలపై ఈ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేకపోవడమే కాకుండా బ్రిటీష్ వారికి ఎలా సహకరించారు అన్న విషయాలను అవగాహన కల్పిస్తారు. కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీల త్యాగాలను వివరించనున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు సహజ సంపద, ప్రభుత్వరంగ సంస్థలు, వ్యవసాయ రంగాన్ని ఎలా కట్టబెడుతున్నది అనే అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌తోపాటు వంటగ్యాస్ ధరల పెంపు, కార్మికకోడ్లతో జరిగే నష్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలను ఎలా ధ్వంసం చేస్తున్నదో నాయకులు వివరిస్తారు. ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చడాన్ని ప్రస్తావిస్తారు. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలు దాడులు చేయడాన్నీ ప్రధానంగా ఆ కార్యక్రమంలో వివిధ రూపాల్లో ప్రజలకు వివరిస్తారు. ఆగస్టు 15న సోమవారం ఉదయం జాతీయ జెండావిష్కరణ కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేస్తారు.