Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆజాదీ కా అమృతోత్సవ్ పేరిట హడావుడి చేస్తున్న మోడీ సర్కారు
- బ్రిటిష్ పాలకుల తొత్తు సావర్కర్
- 75 ఏండ్ల స్వతంత్య్ర పోరాటం ఎన్నో విజయాలు సాధించింది
- దేశం సాధిస్తున్న విజయాలు, లక్ష్యాలకు కమ్యూనిస్టుల ఉద్యమాలు దిశానిర్దేశం
- తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆజాదీ కా అమృతోత్సవ్ పేరిట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హడావుడి చేస్తోందనీ, అసలు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీకి పాత్ర ఎక్కడ ఉందని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య ప్రశ్నించారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో అదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన మేల్కొలుపు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సీఐటీయూ నగర శ్రామిక మహిళా కన్వీనర్ ఆర్.వాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్వీకే ట్రస్టీ వినరు కుమార్ రాజ్యాంగ ప్రవేశికను చదివి అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. జాతీయోద్యమంతో సంబంధం లేని నాయకత్వం ఉత్సవాల వేళ అధికారంలో ఉండటం బాధకరమైన విషయమన్నారు. స్వతంత్ర భారతదేశంలో సహకార, ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చెందడం వల్ల.. దేశం పారిశ్రామికంగా బలోపేతం కావడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. 1990 నాటికే దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధి సాధించిందన్నారు. జాతీయోద్యమ వారసత్వంగా, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వంగా మనకు ఈ రాజ్యాంగం వచ్చిందన్నారు. ఈ రాజ్యాంగంలో ఎన్ని లోపాలు, పరిమితులున్న నేటికీ ప్రజాస్వామ్య, లౌకిక పునాదులు బలంగా ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే విషయంలో అనేక ఒడుదుడుకులు, ఎదురుదెబ్బలు, పరిమితులు ఏర్పడుతున్నా ఏడున్నర దశాబ్దల కాలంలో దాన్ని కాపాడుకోగలిగామని చెప్పారు. ఇది భారతదేశ ప్రజానీకం సాధించిన ముఖ్యమైన విజయంగా గుర్తించాలన్నారు. అన్ని సామాజిక తరగతులకు చదువుతో పాటు దళితులు, గిరిజనులు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి గణనీయమైన సంఖ్యలో రావడానికి రాజ్యాంగం తోడ్పడిందని తెలిపారు. లౌకిక విలువలు ఈ ప్రజా ఉద్యమ పునాదుల నుంచే పట్టిందన్నారు. జాతీయ ఉద్యమం ఆరంభం నుంచి అంతం వరకు అన్ని మతాల ప్రజలు ఐక్యంగా నిలువడంతోనే ఈ స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. మతపరమైన విభజన సృష్టించి తెల్లరొరల సేవలో తరించేందుకు కొన్నిశక్తుల ప్రయత్నాలు చేసినా ఫలించలేదనీ, వాటిని భారత ప్రజానీకం తిరస్కరించిందన్నారు. కుల, మత తేడా లేకుండా ఐక్య పోరాటం వైపే ప్రజానీకం నడిచిందన్నారు.
కాంగ్రెస్, గాంధీ, తిలక్, ముస్లిం లీగ్ నాయకత్వంలో ఉద్యమాలు నడిచాయన్నారు. అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ఉద్యమాలు ఒక చారిత్రాత్మక మైలురాళ్లను నాటినాయన్నారు. ఈ రోజు భారతదేశం సాధిస్తున్న అనేక విజయాలు, సాధించాలని పెట్టుకున్న అనేక లక్ష్యాలకు ఒక దిశా నిర్దేశం చేసింది కమ్యూనిస్టు ఉద్యమేనన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అజాద్, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్ విప్లవకారుల సమూహాల ప్రవాహమే భారత జాతీయోద్యమమని గుర్తుచేశారు. కానీ బ్రిటిష్ పాలకులకు తొత్తుగా పనిచేసిన సావర్కర్ భక్తులే మోడీ అమిత్ షా అని అన్నారు.
ఈ నాయకులు చరిత్రను తిరగరాసే ప్రయత్నాం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలంతా కలిసి అడ్డుకోవాలన్నారు. ఆ స్వాతంత్య్ర ఫలాలు ప్రజల అందరికీ దక్కాలే మరో స్వాతంత్య్ర సంగ్రామం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, పట్నం రాష్ట్ర కార్యదర్శి డిజీ నర్సింహారావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, వృత్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేష్, సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు కుమార్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.