Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్రం ముంగిట ధరల మోత
- జీఎస్టీ అమలుతో నెల రోజుల్లోనే నిత్యావసరాల ధరల్లో పెనుమార్పులు
- ప్రతిరోజూ కొనుక్కునే పెరుగుప్యాకెట్పై నెలకు రూ.150భారం
- కందిపప్పు మొదలుకుని ఉప్పు, టీ, కాఫీపొడి వరకూ వదలని జీఎస్టీ
- వాయువేగంతో దూసుకుపోతున్న వంటగ్యాస్ ధర
- మొత్తంగా పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్‌పై నెలకు రూ.2వేలపైనే అదనపు భారం
- ప్రస్తుతం నిలకడగా ఉన్న కూరగాయల ధరలే కొంత ఊరట
- ఈ భారాలతో బతికేదెట్టా : సామాన్యులు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వంటింట్లో ధరల మంట మండుతోంది. కందిపప్పు నుంచి ఎండుమిర్చి వరకు, మినపపప్పు నుంచి పామాయిల్ వరకు అన్నింటి ధరా పెరుగుతూ పోతోంది. ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించడమూ అంతిమంగా వినియోగదారుడి నెత్తినే భారం పడింది. వంట గ్యాస్ బండ ధర వాయువేగంతో దూసుకుపోతుంటే సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతోంది. మొత్తంగా పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్ సగటున నెలకు రూ.2వేలపైనే పెరిగింది. కూరగాయల ధరలు అందుబాటులో ఉండటమే వినియోగదారులకు కాస్త ఊరట. కందిపప్పు ధర నెలలోనే కిలోకు రూ.10 వరకు పెరిగింది. వంట నూనెల ధరలు దిగొస్తున్నాయంటున్నా.. జనవరి ముందు నాటి స్థాయికి చేరలేదు. మూడేండ్ల కిందటితో పోల్చితే 92శాతం పైగా అధికంగా ఉన్నాయి. పప్పుల ధరల్లోనూ రూ.20 పైనే పెరుగుదల నమోదైంది. అయితే జులై రెండో వారం నుంచి కందిపప్పు ధర పెరగడం మొదలైంది. సాధారణ రకాలు కిలోపై రూ.90, నాణ్యత కలిగిన రకం కిలోపై రూ.98 వరకు ఉండేది. గతేడాది నిల్వలు అడుగంటడంతో ధరలు ఆమాంతం పెరిగాయి. ప్రస్తుతం కిలో కందిపప్పు ధర రూ.115 నుంచి రూ.120 మధ్య పలుకుతోంది. చిన్న పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.125 పైన కూడా విక్రయిస్తున్నారు. బియ్యం ధరా రెండు నెలల కిందటితో పోలిస్తే కిలోకు రూ.3 వరకు పెరిగి 25కిలోల బస్తాపై రూ.75వరకు అదనపు రేటు పెరిగినట్టు వ్యాపారులే చెబుతున్నారు.
వంటనూనెలు, టీ,కాఫీ పొడి ధరలూ పైపైకి...
ఇక టూత్‌పేస్టు, సబ్బులు, టీ, కాఫీ పొడి తదితర నిత్యావసరాలు కూడా తెలియకుండానే జేబుకు చిల్లు పెడుతున్నాయి. కిలో గోధుమపిండిపై నెల రోజుల్లోనే సగటున రూ.5 నుంచి రూ.8 వరకు పెరిగింది. మూడేండ్ల కిందటితో పోలిస్తే వంటగ్యాస్ ధర రూ.63 అధికమవడం వంటింటి మంటను మరింత పెంచుతోంది. కోవిడ్ నుంచి వంట నూనెల ధరలు మంట పెడుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం సమయంలో ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఫిబ్రవరి చివరిలో రెండు రోజుల్లోనే లీటరుపై రూ.20పైగా పెంచారు. అప్పటికే ఉన్న నిల్వలపైనా ఎంఆర్పీ ధరలు సవరించి ఎక్కువ ధరకే అమ్మేశారు. తర్వాత కొంతమేర దిగొచ్చాయి. కొవిడ్ పూర్వ స్థాయికి వంటనూనెల ధరలు రాలేదు.
రూ.2వేలు అదనంగా పెరిగిన నెల బడ్జెట్
పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్లో ఇప్పటివరకు చెప్పుకున్న నిత్యావసరాల ధరలు అధిక శాతం పెరిగినవే. ఇక పొద్దుతిరుగుడు నూనె, పామోలిన్ ధరలూ పెరిగాయి. నెలకు నాలుగు లీటర్లు వాడే కుటుంబంపై సగటున రూ.180 నుంచి రూ.240 భారం పడుతోంది. ఎండుమిర్చి ధర కూడా 100 శాతం పెరిగి కిలో రూ.280 నుంచి రూ.320 వరకు చేరింది. వీటన్నింటికీ కేంద్రం ఇటీవల ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన పర్యవసానమే పేద, మధ్యతరగతి వర్గాల ఇంటి బడ్జెట్‌ను పెంచేసింది. రోజూ పెరుగు ప్యాకెట్ కొనుక్కునే కుటుంబంపైనా నెలకు రూ.150 వరకు పెరిగిందంటే అతిశయోక్తికాదు. మొత్తంగా తయారీ సంస్థలు ఉత్పత్తి వ్యయం పెరిగిందంటూ.. కేంద్రం జీఎస్టీకి అదనంగా మరికొంత వడ్డించడం కొసమెరుపు.
తినే తిండినీ వదలని కేంద్రం
- ఎం.వాసుదేవరెడ్డి, సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి
కేంద్రం తినే తిండినీ వదలకుండా జీఎస్టీని బాదింది. ఇప్పుడది నెల రోజుల్లో దాని పర్యవసానం కండ్ల ముందే కనిపిస్తోంది. సామాన్యుడి నెలవారీ వంటింటి బడ్జెట్ రూ.2వేలపైనే పెరిగింది.
సామాన్యుడు బతికేదెలా?
- మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ చొప్పదండి ఇన్చార్జి
కార్పొరేట్ల భజన చేస్తున్న కేంద్రం సామాన్యుడిని మరింత దోచుకుంటోంది. తినే తిండినీ వదలకుండా పన్నులు వసూలు చేస్తూ సామాన్యుడు బతుకును ఆగం చేస్తోంది. వచ్చే అరకొర ఆదాయంతో బతుకుబండిని లాగుతున్న పేద, మధ్యతరగతి వర్గాలు మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్న పరిస్థితి నెలకొంది.
ఒకపూట పస్తులుంటున్న కార్మికులు
- ఎడ్ల రమేష్, సీఐటీయూ కరీంనగర్ జిల్లా కార్యదర్శి
కార్మికవర్గం రోజువారీ వేతనాలే రూ.300 కూడా దాటలేదు. రూ.8వేల నుంచి రూ.10వేల నెలవారీ వేతనాలతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్న చిరుద్యోగులు రాబోయే రోజుల్లో బతికిబట్ట కట్టే పరిస్థితి లేదు. కేంద్రం ఇలానే పన్నులతో జనం రక్తంతాగితే మిగిలేది కరువుకోరలేనని మరువద్దు.