Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాగితాలమీదే కార్యాచరణ
- వరద ముంపు, మురుగు ముప్పు
- కాలుష్యంతో కకావికలం
- ప్రకటనల్లోనే రూ.10వేల కోట్లు
- మురుగు శుద్ధి పెరగాలి : సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
'గోదారమ్మ ఇప్పటికే కాళేశ్వరం కాడ గట్టెక్కి.. కొండ పోచమ్మ కాడ గుట్టెక్కింది.. తర్వాతి దశలో ఆ నీటిని మన భాగ్యనగరానికి తరలిస్తాం.. మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి నదిని స్వచ్ఛంగా మారుస్తాం. మూసీనదిని సమూలంగా ప్రక్షాళన చేయడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాం. మురుగునీటి శుద్ధి చేయడానికి ఇరువైపుల 59ఎస్టీపీలు నిర్మిస్తాం. బాఫూఘాట్ నుంచి నాగోల్ మధ్యలో బోటింగ్ ఏర్పాటు చేస్తాం. రూ.5వేల కోట్లు వెచ్చిస్తాం' అంటూ జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు సైతం మూసీ సుందరీకరణ ప్రధాన ఎజెండా చేసుకున్నాయి. పలుమార్లు మూసీ ప్రక్షాళన, సుందరీకరణ గురించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనలే తప్ప ఆచరణకు నోచుకోలేదు.
నేపథ్యం....
మూసీనది, ముచుకుందా నది, మూసీనూరు నదిగా పిలవబడే మూసీ కృష్ణానదికి ఉపనదిగా ఉంది. ఈ ఉపనది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ మధ్య గుండా 250 కిలోమీటర్లు ప్రవహించి నల్లగొండ జిల్లా వాడపెల్లి (మిర్యాలగుడ) వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. 1908 సెప్టెంబర్ 28న వచ్చిన వరదలతో 15వేల మంది మరణించారు. ఈ నది వరదలను ఆపడానికి నగరానికి ఎగువన 1920లో ఉస్మాన్‌సాగర్, 1927లో హిమాయత్‌సాగర్ డ్యామ్‌లు నిర్మించారు. ఈ రెండు డ్యామ్‌లు నగరానికి తాగునీటి వనరులుగా ఉన్నాయి. 1912లో 7వ నిజాం మూసీనదికి ఇరువైపుల హైదరాబాద్ పట్టణాన్ని నిర్మించారు.
వరదల ముంపు
భారీ వర్షాలు కురిశాయంటే నగరవాసులు జంకుతున్నారు. ఎగువన వర్షాలు కురిస్తే మూసీ ఉగ్రరూపం దాల్చుతుంది. దాంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు చెందిన నీటిని దిగువకు వదలాల్సిందే. ఫలితంగా నగరానికి వరదలు తప్పవు. 1908 నుంచి నేటి వరకు వరదల నుంచి నగరాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ముఖ్యంగా 2012, 2016, 2020, 2022లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. 2020లో వరదల దెబ్బకు నగరమంతా అతలాకుతలమైంది. 2లక్షలకుపైగా ఇండ్లు నీటమునిగాయి. ఈ ఏడాది జులైలో కురిసిన వర్షాలకు ముసారాంబాగ్, పురానాపూల్, చాదర్ఘట్ బ్రిడ్జీలు నీటమునిగాయి.
మురుగు ముప్పు..
మూసీ మురుగునీటితో కృష్ణానదికే ముప్పువాటిల్లనుం ది. వాడపల్లి వద్ద కలుషిత నీరంతా కృష్ణానదిలో కలుస్తోందని, మూసీని ప్రక్షాళన చేయకపోతే కృష్ణా జలాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో 120కిపైగా పరిశ్రమలున్నాయి. ముఖ్యంగా కెమికల్, ఫార్మా కంపెనీలైన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎన్ఎస్, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, యూఎస్ జెయింట్ మైలాన్ ఇంక్, మందుల తయారీ పరిశ్రమల నుంచి విషపునీరు కలుషితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నా రు. 1970లో రోజుకు 325మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అయితే ప్రస్తుతం 1625 మిలియల్ లీటర్ల మురుగు మూసీలో కలుస్తోంది. కాని ప్రభుత్వం 725 మిలియన్ లీటర్ల మురుగునీటిని మాత్రం శుద్ధి చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో 900ఎంఎల్ నీటిని శుద్ధి చేయాల్సి ఉంది. దాంతో శుద్ధి చేసిన నీరంతా మళ్లీ మురుగు లోనే కలుస్తుంది. అయితే 2029 వరకు 1625మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తామని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న మూసీని మార్చలేకపోతున్నారనే విమర్శలూలేకపోలేదు. దాంతో పోచంపల్లి, శాలీగౌరారం, వలిగొండ మండలాల్లో నీరంతా విషపూరితంగా మారింది. భూగర్భజలాలు సైతం విషపూరితంగా మారాయి. దీని కారణంగా చర్మవ్యాధులు, గర్భశ్రవాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
రూ.10వేల కోట్లు ఏమయ్యాయి..?
మూసీ సుందరీకరణకు సంబంధించిన ప్రణాళికలను త్రీడీ సినిమా తరహాలో రూపొందించారు. రూ.10వేల కోట్లు అయితే మూసీ రూపురేఖలు మార్చడానికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 55కిలోమీటర్ల మేర కిలోమీటర్‌కు పైనరోడ్డు కింద ఎస్టీపీ నిర్మించాలని ప్రతిపాదించారు. అంబర్పేట్ వద్ద ప్రయివేటు ల్యాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో భూసేకరణకు సైతం వెళ్లాల్సి ఉంది. ఇక్కడ బోటింగ్ ఏర్పాటు, రీక్రియేషన్ జోన్స్, మాల్స్, థియేటర్ జోన్స్తోపాటు పర్యాటకాన్ని అభివృద్ధి చేసేవిధంగా ప్రణాళికలు తయారు చేశారు. కాని ఇప్పటి వరకు అధికారులు తయారుచేసిన డీపీఆర్‌ను అటకెక్కించారు. ఎనిమిదేండ్లలో సుమారు రూ.1500కోట్లు కేటాయించిన సర్కార్ రూ.3.12కోట్లు మాత్రమే ఖర్చుచేశారు.
చిత్తశుద్ధితో పనిచేయాలి : సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
మూసీ ప్రక్షాళన విషయంలో తెలంగాణ సర్కార్ చిత్తశుద్దితో పనిచేయాలి. మూసీని ప్రక్షాళన చేసి కాలుష్య నీటికి బదులు కృష్ణా, గోదావరి జలాలను నింపాలి. హైదరాబాద్ నుంచి వస్తున్న మురుగునీటిని శుద్ధి చేయకపోతే కృష్ణానదిలో మురుగు కలుస్తుంది. మూసీ కాలువల కింద పండిన పంటలు వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయి. దాంతో రైతులు నష్టపోతున్నారు. మూసీపై ఉన్న 27 ఆనకట్టలను తొలగించాలి. మూసీ ప్రక్షాళన, పరిరక్షణ గురించి సీపీఐ(ఎం) భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభమైంది.