Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవి ఉచితాలు కాదా?
- బడాపారిశ్రామికవేత్తలు, పాలకుల క్రోనీకాపిటలిజం
- మోడీ మాటలను లెక్కచేయని యూపీ సీఎం యోగి
- రైతులు కాని వారికి రైతుబంధు : ఆప్ శిక్షణా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రైతుల రుణాలు మాఫీ చేస్తే ప్రభుత్వాలు, బూర్జువా మీడియా దేశమంతా ప్రచారం చేస్తాయి. అదే కార్పొరేట్ శక్తులకు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇస్తే మాత్రం ఎలాంటి ప్రచారం ఉండదు. పేద ప్రజలు, రైతులకు ఇచ్చేవే ఉచిత పథకాలు అవుతాయా?. కార్పొరేట్లకు రాయితీలు ప్రకటించడం ఉచిత పథకాలు కావా?'అని ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సంస్థలకు రూ.రెండు లక్షల కోట్లకుపైగా రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఈ ఐదేండ్ల కాలంలో రూ.10 లక్షల కోట్ల రాయితీలు వాటికి ప్రకటించిందని చెప్పారు. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణ, శిక్షణా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ ఉచిత పథకాలు ప్రమాదకరమంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదన్నారు. యూపీలో 60 ఏండ్లు నిండిన మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారని చెప్పారు. ఢిల్లీలోనూ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణాను కల్పిస్తున్నదని వివరించారు. కేజ్రీవాల్ చేస్తే తప్పు, యోగి చేస్తే ఒప్పు అవుతుందా?అని మోడీని ప్రశ్నించారు. మహిళలకు చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే ఆర్థికాభివృద్ధి మెరుగవుతుందని అన్నారు. రాష్ట్రంలో రూ.రెండు లక్షల కోట్ల బడ్జెట్లో మూడు శాతం అంటే రూ.ఆరు వేల కోట్లతో పేదలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించొచ్చని సూచించారు. దళితబంధుకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. రుద్రాక్ష, బొట్టు బిల్లలపై పన్ను విధించకుండా శానిటరీ ప్యాడ్లపై 12 శాతం జీఎస్టీ వేయడం ఎంత వరకు సమంజసమని కేంద్రాన్ని ప్రశ్నించారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్యాడ్లపై కేంద్రం జీఎస్టీని తొలగించిందని చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు, పాలకుల మధ్య క్రోనీకాపిటలిజం ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక సన్నిహితంగా ఉండే కార్పొరేట్లకు పాలకులు మేలు చేస్తున్నారనీ, ఎన్నికలపుడు వారు ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు ఆ పార్టీకి ఆర్థిక సహాయం చేస్తున్నారని వివరించారు. 2011లో భారత్లో 55 మంది బిలియనీర్లుంటే, 2021 నాటికి 140 మందికి పెరిగారని గుర్తు చేశారు. దేశ జీడీపీలో వారి సంపద 13 శాతం నుంచి 20 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్నా దేశ ప్రజలు పేదలుగానే ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రాయితీలు ప్రకటించకుండా కొత్త విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ఆ నిధులను ఖర్చు చేస్తే ఎంతో మేలు జరుగుతందన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేస్తే ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందంటూ అనేక మంది ఆర్థికవేత్తలు సూచించినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి వాటికి నిధులను ఖర్చు చేయాలని సూచించారు. రైతులు కాని వారికి రైతు బంధు అందుతున్నదని చెప్పారు. సాగుచేసే వారికి కాకుండా యజమానులకే ఆ డబ్బు అందుతున్నదని అన్నారు. 50 ఎకరాల భూమిని ఎవరైనా కొని పడావు పెట్టినా రైతుబంధు అందుతున్నదని వివరించారు. ఇలాంటి పథకాల్లో మార్పు రావాలన్నారు. మంచి రాజకీయాలు రావాలని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆసరాగా చేసుకుని అందుకోసం పోరాడాలని కోరారు. మార్చగల నమ్మకం, రాజ్యాంగం పట్ల విశ్వాసంతో పోరాడితే ఏదో ఒకరోజు విజయం సాధిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్, నిర్మాణాభివృద్ధి, శిక్షణా కమిటీ కన్వీనర్ డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.