Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం రూ.5 వేల కోట్లు కేటాయిస్తేనే సమస్యలు పరిష్కారం
- ఓటర్లను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ యత్నం : పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడులో కమ్యూనిస్టులు, టీజేఎస్ పార్టీలో కలిసి పోదామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడి ప్రజాసమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ 5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టీిఆర్‌ఎస్ మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడనుకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై చర్చ జరుగుతున్నదని విమర్శించారు. ప్రజా సమస్య ఆధారంగా బీజేపీ, టీఆర్ఎస్ విధానాలపై మునుగోడు ఉప ఎన్నికల్లో చర్చ జరగాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై పడ్డ భారంపై కూడా ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షల రూపాయలు జమ చేస్తామనీ, ప్రతియేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ చొప్పున ఎనమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఒక్క ఉద్యోగమైన ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్నా... ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బీజేపీ ఇచ్చిన ఒక్క వాగ్దానం నెరవేర్చలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగినా కూడా వాటిని నియంత్రించి పేదలను ఆదుకోలేదని తెలిపారు. టీఆర్ఎస్ ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీలేమయ్యాయని టీఆర్ఎస్ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్కు ఓట్లు అడిగే నైతిక హక్కులేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఈ రెండు పార్టీలను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కే ఉందని వివరించారు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.