Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న గుడిసెవాసుల పోరాట స్ఫూర్తి
- 100 రోజుకు చేరిన భూ పోరాటం
- సీపీఐ(ఎం) అధ్వర్యంలో విజ్ఞాన, ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం
నవతెలంగాణ-మట్టెవాడ
జనసముద్రమైన జక్కలొద్దిలో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు ప్రజలు ఉల్లాసంగా జరుపుకునే సంక్రాంతి పండుగ జక్కలొద్దిలో ఆదివారమే వచ్చిందా అనే విధంగా ప్రతి గుడిసె ముందు రంగురంగుల ముగ్గులు ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం జొక్కలొద్ది గ్రామంలో గుడిసెవాసుల భూ పోరాటాలు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు తమ ఆనందాన్ని, ఆత్మీయతను ప్రేమాభిమానాలను ఒకరికి ఒకరు పంచుకున్నారు. డప్పు, వాయిద్యాలు, ఆటపాటలు, కోలాటాలతో వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఆడబిడ్డలు ఎర్రని చీరలతో, అన్న తమ్ముళ్లు ఎర్రని చొక్కాలతో గుడిసెల ప్రాంతం వర్షంలో కూడా అరుణ వర్ణమై ప్రకాశించింది. ఈ సందర్భంగా పదివేల పైచిలుకు గుడిసె వాసులున్న జక్కలొద్దిలో నివసిస్తున్న పేద ప్రజల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రామ సురేందర్ స్మారక హెల్త్ కేర్ సెంటర్, సుందరయ్య స్మారక స్టడీ సెంటర్ను ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.రాములు, జిల్లా కార్యదర్శి రంగయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఇద్దరు వైద్యులు, మందులతో కూడిన ఆరోగ్య కేంద్రం గుడిసె వాసులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. యువత, చిన్న పిల్లలు విజ్ఞానపరంగా చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా లైబ్రరీలో విజ్ఞాన సంబంధిత పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
అనంతరం రంగశాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన జరిగిన 'సేవ్ ఇండియా' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జి.రాములుతో పాటు జగదీష్, జిల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య పాల్గొని మాట్లాడారు. తలదాచుకోవడానికి జానెడు జాగ కోసం రౌడీలకు ఎదురొడ్డి, పోలీసుల దెబ్బలకు ఎదురెల్లి, కేసులకు భయపడకుండా నిరుపేదలు పోరాడిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. గుడిసెలను పోలీసులు తగలపెడితే నెలల తరబడి పోరాడి మళ్లీ గుడిసెలు వేసుకోవడంతో పాటు ఆరోగ్య, విజ్ఞాన కేంద్రాలనూ ఏర్పాటు చేసుకొని మొక్కవోని ధైర్యంతో ముందుకు పోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పేద గుడిసె వాసులు ఐక్యమత్యంతో ఉంటూ సొంతింటి కలను సాధించుకోవాలని తెలిపారు.
పేదవాడి మనో ధైర్యం ముందు రౌడీలు పోలీసులు ప్రజాప్రతినిధుల అధికారుల దౌర్జన్యాలు నిలబడలేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడున్న పేద ప్రజలకు పట్టా స్థలాలను కేటాయించి డబుల్ బెడ్ రూమ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు సీపీఐ(ఎం) పేద ప్రజల పక్షాన నిలబడి వారి సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాడుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) రంగశాయిపేట నాయకులు ఓదేలు, రమేష్, సందీప్, చందు, తదితరులు పాల్గొన్నారు.