Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజస్థాన్లో దళిత విద్యార్థిని దారుణంగా హత్యచేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత వర్గానికి చెందిన తొమ్మిదేండ్ల ఇంద్ర మేఘ్వాల్ అనే బాలుడు ఉన్నత కులాల ఉపాధ్యాయుల కోసం కేటాయించిన కుండలోని నీటిని తాగినందుకు ఉపాధ్యాయుడు కొట్టడంతో శనివారం మరణించాడని తెలిపారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని జలోర్ జిల్లాలోని 'సరస్వతి విద్యామందిర్'లో చోటుచేసుకుందని పేర్కొన్నారు. గతనెల 20న ఈ ఘటన జరగ్గా, శనివారం విద్యార్థి మరణించారని వివరించారు. భారతీయ విద్యా వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా బ్రాహ్మణీయంగానే ఉందనడానికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించారు. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులను సామాజిక రుగ్మతల నుంచి విముక్తి పొందాల్సిన అవసరముందని తెలిపారు. రాజస్థాన్లో జరిగిన సంఘటన కులతత్వానికి, అంటరానితనానికి మరో ఉదాహరణ తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థి మరణం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా దళితులు సమాజంలోని ఇతర బలహీన వర్గాలు 'స్వేచ్ఛ'ను పొందలేకపోతున్నారని తెలిపారు. రాజస్థాన్ సంఘటనకు నిరసనగా మంగళవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరణించిన విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.