Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతి.. సామరస్యాలను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడదాం...
- ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత నాదే
- పసివాళ్లు తాగే పాలు మొదలు శ్మశానం దాకా అన్నింటిపై కేంద్రం భారాలు
- సంక్షేమ పథకాలను ఉచితాలని అవమానించడం గర్హనీయం
- రాష్ట్రాలను బలహీనపర్చేందుకు కేంద్రం కుట్ర
- జాతీయ జెండా ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
- గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణలు నేడు చోటు చేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండి ప్రగతి పథంలో పయనిస్తున్న తెలంగాణలో సైతం మత చిచ్చు రేపేందుకు, తద్వారా ఇక్కడి శాంతిని, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఇక్కడి అభివృద్ధిని దెబ్బతీసేందుకు ఆయా శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మేధావులు, యువకులు, విద్యార్థులు, ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం ద్వారా వాటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇంతటి కీలక సమయంలో ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించకుండా సకల జనులనూ విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపిస్తామని తెలిపారు. ఒక ముఖ్యమంత్రిగా ఆ గురుతర బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. ఆ క్రమంలో పంద్రాగస్టు సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... దేశంలో తరతరాలుగా వస్తున్న శాంతియుత సహజీవనాన్ని చెడగొట్టేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్టు దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర ఉద్యమ ఆశయాలను కాపాడుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలు వల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరి స్తున్నదని విమర్శించారు. అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతూ రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం చేస్తున్నదని వాపోయారు. పసి పిల్లలు తాగే పాలు మొదలుకుని స్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నింటి మీదా అడ్డ గోలు పన్నులు వేయటం ద్వారా కేంద్రం... పేద వర్గాల నడ్డివిరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం అమలుచేసే సంక్షేమ పథకాలను ఉచితాలంటూ ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు, కేంద్రంలోని మంత్రులు అవమానించడం గర్హనీయమన్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపర్చే కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నదని చెప్పారు. సెస్సుల రూపంలో రాష్ట్రాల ఆదాయాలకు గండికొట్టి.. మోడీ సర్కారు దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలో తీసుకునే రుణాల మీద సైతం కోతలు విధించడం కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల దేశ ఆర్ధికాభివృద్ధి కుంటుపడుతున్నదని కేసీఆర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
దేశానికే తెలంగాణ దిక్సూచి..
అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం 60 ఏండ్లపాటు ఉద్యమించిన తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారిందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ రాష్ట్రం పరుగులు పెడుతున్నదని అన్నారు. వ్యవసాయంలో 11.6శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశానికే అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. పారిశ్రామిక రంగంలో 12.01శాతం, ఐటి ఎగుమతుల్లో సైతం దేశంలో అత్యధికంగా 26.14 వృద్ధిరేటు సాధించామని తెలిపారు. ఏడేండ్లలోనే రాష్ట్ర ఆదాయం మూడు రెట్లు అంటే రూ.1.84 లక్షల కోట్ల పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 127 శాతానికి పెరిగిందని చెప్పారు. ఇది దేశ వృద్ధి రేటు కంటే 27 శాతం అధికంగా ఉందన్నారు. కొత్తగా మరో 10 లక్షల మందికి ఈనెల నుంచి ఆసరా పింఛన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. దళిత జాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ దేశంలో నెంబర్ వన్ సంక్షేమ రాజ్యంగా తెలంగాణ ఖ్యాతి పొందిందని సిఎం వివరించారు. వ్యవసాయరంగంలో తీసుకున్న విప్తవాత్మక నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో సాగు రెండు కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిచ్చి కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించామని చెప్పారు. 2014లో తెలంగాణలో 68లక్షల టన్నుల వరిధాన్యం పండితే నేడు మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో 18.6శాతం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతుందని చెప్పారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదనీ, సర్కారు బడులను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయనీ, గ్రామ స్వరాజ్యం దిశగా గొప్ప పురోగతిని సాధించామన్నారు. వైద్య రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పామని చెప్పారు. వచ్చే రెెండేండ్లలో ప్రతీ జిల్లాకు ఒక వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించిందన్నారు. ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామనీ, త్వరలో మరో 91,142 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మేం చేసిన అప్పులు రూ.1,49,873 కోట్లు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.75 వేల కోట్ల అప్పు మనకు సంక్రమించిందని... తమ ప్రభుత్వం మరో రూ.1,49,873 కోట్లు అప్పు చేసిందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఆ రుణ మొత్తాన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగా వినియోగించినట్టు వివరించారు. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 23.5శాతంగా ఉందన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ చట్ట పరిధిలోనే అప్పులు ఉన్నాయని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి వాస్తవాలను గ్రహించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు కేసీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పోలీసుల గౌరవవందనం స్వీకరించిన సీఎం... పరేడ్‌ను పరిశీలించారు. పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోటను అధికారులు మువ్వన్నెల జెండాలతో అందంగా ముస్తాబు చేశారు. కళాకారులు ప్రదర్శించిన పలు కళారూపాలు ఆకట్టుకున్నాయి.