Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- రాష్ట్ర కార్యాలయంలో పతాకావిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సామాజిక సమానత్వం కోసం జాతీయోద్యమ స్ఫూర్తితో మరో సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటం అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నదని పాక్షిక స్వాతంత్య్రం మాత్రమేనని చెప్పారు. బ్రిటీష్ పాలనలో దోపిడీ ప్రత్యక్షంగా ఉంటే, ప్రస్తుత స్వతంత్ర భారతంలో అవే విధానాలు పరోక్షంగా ప్రజల్ని దోపిడీకి గురిచేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎమ్బీ భవన్లో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. పరాయి పాలకుల నుంచి విముక్తి కోసం జరిగిన స్వాతంత్య్ర పోరాటం చాలా గొప్పదని చెప్పారు. వలస పాలన దేశ సంపద, నాగరికత, సంస్కృతి, అభివృద్ధికి ఆటంకంగా మారిందని విశ్లేషించారు. ఇప్పుడు నాగరికులమని చెప్పుకుంటున్న సామ్రాజ్యవాద దేశాలకంటే అనేక ఏండ్ల క్రితమే భారతదేశం, చైనా దేశాలు అతిగొప్ప నాగరికతను ప్రపంచానికి పరిచయం చేశాయన్నారు. కేవలం అనైక్యత వల్లే భారత భూభాగం పరాయి పాలకుల చేతుల్లోకి వెళ్ళిందన్నారు. భారత జాతీయ స్వాతంత్య్రోద్యమం లో కమ్యూనిస్టుల ముందుచూపు, శ్రామిక జన హక్కుల పరిరక్షణ, త్యాగాలను వివరించారు. పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రంలో కొన్ని పరిమి తులు ఉన్నాయన్నారు. రాజకీయ స్వాతంత్య్రంలో ఓటుహక్కు ద్వారా స్వీయ పాలకులను ఎన్నుకునే అవకాశం వచ్చినా, దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించే ప్రయత్నాలు జరగలేదన్నారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ తప్పిదాల నుంచే ఇప్పటి మతోన్మాద బీజేపీకి అవకాశాలు వచ్చాయన్నారు. ఆపార్టీ రాజకీయ స్వాతంత్య్రాన్ని కాలదన్ని దేశాన్ని నియంతృత్వ, మతోన్మాద రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ పీఠికలో ప్రధానమైన లౌకిక, ఆర్ధిక స్వావలంబన, సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కు లు అనే నాలుగు విలువలు ఇప్పుడు అమల్లో లేవన్నా రు. ఉన్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ప్రజా స్వామ్యవాదులకు అతిపెద్ద పనిగా మారిందన్నారు. ఆ పని చేస్తూనే సమానత్వంతో కూడిన సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాటం చేయాలని చెప్పారు.
సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు జీ నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. 57 శాతం సంపద కేవలం కొద్దిమంది దగ్గరే పోగై ఉందనీ, ఫలితంగా భారతదేశం పేదలు ఎక్కువగా ఉండే దేశంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటాలు కొనసాగాలని ఆకాంక్షించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బీ వెంకట్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంతో పాటు ఇప్పుడూ కమ్యూనిస్టుల పై గురుతర బాధ్యతలు ఉన్నాయని అన్నారు. జాతీ యోద్యమాన్ని కమ్యూనిస్టులు ఎలాగైతే ముందుండి నడిపారో అదే స్ఫూర్తితో ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ, సంపూర్ణ స్వాతంత్య్ర సాధన లక్ష్యంతో అవే వారసత్వ ఉద్యమాలు కొనసాగాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ ంతో ఏమాత్రం సంబంధంలేని ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఇప్పుడు 'ఘర్ ఘర్ కు తిరంగా' అంటూ ఆ పోరాటాన్ని తామే చేసినట్టు ప్రకటించుకుంటున్నా యని విమర్శించారు. స్వాతంత్య్రోద్యమకారుల త్యాగాలు, వారి కలలు సంపూర్ణంగా నెరవేరలేద న్నారు. దీనికి పాలకుల తప్పుడు విధానాలే కారణ మని వివరించారు. పాలకుల తప్పుడు విధానాలు, మతోన్మాదంకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు చేపట్టాలని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యురాలు టీ జ్యోతి రాజ్యాంగ పీఠికను చదువుతూ ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి వందన సమర్పణ చేశారు.