Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు ఆదాయవనరుల సమీకరణలో గులాబీ సర్కారు
- ఉన్నతస్థాయిలో సమాలోచనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తున్నది. పలువిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. మోడీ సర్కారు ఆంక్షలు, ఆర్బీఐ పరిమితులు గులాబీ సర్కారును ఉక్కిరిబిక్కరిచేస్తున్నాయి. ఈతరుణంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అదనపు అదాయంపై దృష్టిసారించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఆ విషయమై ప్రధానంగా చర్చించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు ఖర్చవుతున్నాయని సర్కారు చెబుతున్నది. ఇందుకు ప్రతినెలా వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం గత ఆరేండ్లుగా భారీగా అప్పులుచేస్తున్నది. బీజేపీ సర్కారు నిధులు ఇవ్వడం లేదంటూ రాష్ట్రం పదే పదే ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈపరిస్థితుల్లో పరిపాలన గులాబీ ప్రభుత్వానికి కత్తిమీదసాములా తయారైంది.
ఏం చేయబోతున్నది ?
రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తున్న తరుణంలో రుణాలు ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. తిరిగి ఎలా కడతారో చెప్పాలంటూ కొర్రీలు పెడుతున్నాయి. ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో రుణాలు తెస్తున్నది. భూముల అమ్మకం ద్వారా గత ఏడాది సర్కారు రూ. 12 వేల కోట్లు సమకూర్చుకుంది. కేంద్రం నుంచి ప్రతియేటా సాధారణంగా రూ.52 వేల కోట్లు రావాల్సి ఉంటుంది. ఇందులో దాదాపు రూ. 19 వేల కోట్లు మోడీ ప్రభుత్వం ఎగ్గొడుతున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 3.5 లక్షల కోట్ల అప్పులున్నాయి. కాగా ప్రతినెలా రూ. 13 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఇందులో రూ. 70 శాతం జీతభత్యాలు, పింఛన్లు, ప్రభుత్వ నిర్వహణ కోసం ఖర్చవుతున్నదని చెబుతున్నారు. కాగా రూ. 4 నుంచి 5 వేల కోట్ల వరకు లోటు కనిపిస్తున్నది. ఈపరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత అడ్డంకిగా మారిందని మంత్రులు, ఉన్నతాధికారులు అంటున్నారు. ఈనేపథ్యంలోనే సర్కారు పరిధిలోని కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని భావిస్తున్నది. తాజాగా మరోసారి కానీ, తాజాగా దానిపైనా కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ(టీఎస్ ఆర్డీసీ) నిధులపై సమీకరణపై భారీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర ప్రజలపై రోడ్డు సెస్ విధించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
ఇతర రాష్ట్రాల్లో....
నిధుల కోసం ఇతర రాష్ట్రాల్లో ఆర్డీసీలు ఏం చేస్తున్నాయో తదితర అంశాలపై తెలంగాణ ఆర్టీసీ అధ్యయనం చేసింది. ఆమేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్డీసీ డీజీల్‌పై రోడ్డు సెస్ వేయడం ద్వారా నిధులు సేకరించినట్టు గుర్తించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఆర్డీసీ బోర్డు సమావేశంలో ఈ విషయమై చర్చకు వచ్చినట్టు సమాచారం. రోడ్డు సెస్ ద్వారా ఏపీ ఆర్డీసీ రూ.250 కోట్ల మేర నిధులు సమకూర్చుకుని రోడ్ల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నట్టు తేలింది. ఈనేపథ్యంలో పెట్రోల్, డీజీల్‌పై ఒక శాతం లేదా రెండు శాతం సెస్వేద్దామనే ప్రతిపాదన తెలంగాణ ఆర్టీసీ బోర్డు మీటింగ్‌లో చర్చకు వచ్చినట్టు తెలిసింది. తద్వారా రూ.800 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు తెలంగాణ ఆర్డీసీ భావిస్తున్నది. ఇదే విషయాన్ని బ్యాంకులకు చెప్పి అప్పులు తీసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నది. కాకపోతే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో రోడ్డుసెస్ వేసే సాహసం చేయకపోవచ్చనే ప్రచారమూ జరుగుతున్నది.
ఇప్పటికే...
రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధికి ఇప్పటికే రెండు విడతలుగా రూ.2600 కోట్ల రుణం తీసుకున్నది. వీటికి సంబంధించిన అసలు, వడ్డీ క్రమంగా చెల్లిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా మరోసారి ఆర్బీఐ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి దాదాపు రూ.800 కోట్ల మేర రుణం తీసుకోవాలని భావిస్తున్నది. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తే, ఏ ఏ రోడ్లు అభివృద్ధి చేయాలో, వాటితో రూరల్ రోడ్లు, రాష్ట్ర రహదారులు ఎన్ని నిర్మించాలనే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారుచేస్తున్నట్టు తెలిసింది. ఈనెలాఖరులో జరగనున్న ఆర్డీసీ బోర్డు సమావేశంలో రోడ్డు సెస్ విధించే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.