Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్ర పోరాటాన్ని, చరిత్రను దొంగిలించే యత్నం : సురవరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 52 ఏండ్లపాటు జాతీయ జెండాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్) అంగీకరించలేదని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగాన్ని ఆమోదించలేదనీ, దానిస్థానంలో మనుస్మృతిని అమలు చేయాలంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు భారతదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని, చరిత్రను దొంగిలించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభనుద్దేశించి సురవరం మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులు మహత్తర పాత్ర పోషించారని అన్నారు. 1925లో కమ్యూనిస్టు పార్టీ కంటే ఆర్నెల్ల ముందు పుట్టిన ఆర్ఎస్ఎస్ మాత్రం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొననేలేదని విమర్శించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహించాలంటూ ప్రధాని మోడీ ప్రకటించడం మంచిదేననీ, అయితే నాటి పోరాటంలో అసువులుబాసిన వేల మంది అమరవీరులు, నేతృత్వం వహించిన నాయకులను స్మరించడం లేదని చెప్పారు. కమ్యూనిస్టుల పోరాటాలను విస్మరించారని విమర్శించారు. కమ్యూనిస్టులపై దేశద్రోహులనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన దేశ సంపద పున్ణపంపిణీ జరగాలనీ, కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైన సందపను అందరికీ పంచాలంటూ స్వాత్రంత్య వజ్రోత్సవాల సందర్భంగా మరో జాతీయోద్యమానికి కమ్యూనిస్టు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1947లో దేశంలో ఆస్థిపరంగా రూ.400 కోట్లతో నిజాం నవాబు అందరికంటే ముందుండేవారనీ, తర్వాత రెండు, మూడు కోట్ల రూపాయల ఆస్తులతో టాటా, బిర్లాలు, మరో ఐదారుగురు మాత్రమే కోటీశ్వరులుండేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో 140 మంది శతకోటీశ్వరుల చేతిలో రూ.75 వేల కోట్ల చొప్పున సంపద ఉందనీ, జనాభాలో నూటికి 50 శాతం మంది దారిద్య్ర రేఖ దిగువకు పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ స్వాతంత్య్రం వచ్చినప్పుడే కాకుండా సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రాలు వచ్చినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. అందరికీ ఆహారం, విద్యా, వైద్యం అందాలని అంబేద్కర్, నెహ్రూలు సూచించారని అన్నారు. సంపద పంపిణీతో పాటు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, పేదలకు రాజ్యాంగబద్ధంగా ఆర్థిక, సామాజిక అంశాలలో న్యాయబద్ధమైన వాటా కోసం ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను తక్కువ చేసి చూపిస్తున్నారనీ, అసలు ఆ పోరాటంలోనే లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ స్వాతంత్య్ర పోరాట ఘనతను కుట్రపూరితంగా సొంతం చేసుకోవాలని చూస్తున్నా యని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులు కందిమళ్ల ప్రతాప రెడ్డి, ఏటూకూరి కృష్ణమూర్తి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్ బాలమల్లేశ్, విఎస్ బోస్, జాతీయ సమితి సభ్యులు కె శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.