Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్, సీఎం మధ్య కొనసాగుతున్న విభేదాలు
- ఎట్ హోంకు కేసీఆర్ డుమ్మా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మధ్య అదే గ్యాప్ కొనసాగుతున్నది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమానికి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం అందించింది. చివరికి ఆయన హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఎట్ హోంకు రావాలంటూ హైకోర్టు సీజే, సీఎంలకు స్వయంగా తానే లేఖ రాశానని చెప్పారు. సాయంతం 6 గంటల 55 నిమిషాలకే కేసీఆర్ వస్తారంటూ సీఎంవో అధికారులు సమాచారం కూడా ఇచ్చారని ఆమె వివరించారు. కేసీఆర్ కోసం తాను, సీజే 30 నిమిషాలపాటు ఎదురుచూశామని అన్నారు. అతిథులంతా ఎదురుచూస్తున్నారనే కారణంతో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో సీఎంవో సమాచారం ఇవ్వలేదంటూ తమిళిసై ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కొద్ది నెలల క్రితం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తోనూ ఆయన ముచ్చటించారు. కానీ ఇప్పుడు 'ఎట్ హోం' కార్యక్రమానికి సీఎం గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చనీయాంశమైంది.