Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ పాదయాత్రలో ఘర్షణ
- ఉద్యోగాల గురించి ప్రశ్నించిన టీఆర్ఎస్ కార్యకర్తను అడ్డుకున్న బీజేపీ నేతలు
నవతెలంగాణ-దేవరుప్పుల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో బండి సంజరు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల గురించి మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ టీఆర్ఎస్ కార్యకర్త లేచి కేంద్రం నుంచి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండని ప్రశ్నించారు. దాంతో అతన్ని పోలీసులు, బీజేపీ కార్యకర్తలు వెంబడించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులకు ఈ విషయం తెలియడంతో వారు బీజేపీ కార్యకర్తలను ప్రతిఘటించారు. ఇరువురు రాళ్లతో దాడి చేసుకున్నా రు. ఈ ఘటనలో టీఆర్ఎస్ నాయకులు కోతి ప్రవీన్, వడ్లకొండ శ్రీకాంత్, రమేష్, సత్తమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జనగామలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. దాడికి నిరసనగా టీఆర్ఎస్ నేతలు జనగామ-సూర్యాపేట రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. బీజేపీ ఫ్లెక్సీలను తొలగించారు.
దాడి అమానుషం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ నాయకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడారు. దేవరుప్పుల మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు కావాలని పథకం ప్రకారం దాడి చేశారని, బయటి నుంచి గుండాలను తీసుకొచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అమానుషమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కార్యకర్తలను ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.