Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో క్షేత్రస్థాయిలోకి పార్టీల నేతలు
- వేడెక్కిస్తున్న నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల షెడ్యూల్ రాలేదు కానీ.. ఉప ఎన్నికలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఉరకలేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలంతా పల్లెల్లోకి చేరుకున్నారు. అక్కడి నుంచే తమ ఎన్నికల కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నేతల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జంప్ జిలానీలు పెరుగుతున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్, గత ఉప ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువును దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్, ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జంప్ జిలానీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. మూడ్రోజుల కిందట చౌటుప్పల్ మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు, నారాయణపురం, చండూరు మండలాల నుంచి దాదాపు 15మంది ఇప్పటివరకు టీఆర్ఎస్లో చేరినట్టు తెలుస్తుంది. వీరందరికీ స్వయంగా మంత్రి జగదీశ్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, టీఆర్ఎస్లోనూ కొందరు అసంతృప్తి నేతలను రాజగోపాల్‌రెడ్డి దగ్గరకు తీసి బీజేపీ కండుపా కప్పుతున్నారు. చౌటుప్పల్ మండల ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బుచ్చిరెడ్డికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కండువా కప్పి బీజేపీలో చేర్చుకున్నారు.
ఇదిలా ఉంటే, స్థానిక నాయకులు లేకుండానే ఇతర పార్టీల వారిని చేర్చుకుంటే.. ఇంతకాలం ఇక్కడ పనిచేసిన తమకెలా విలువ ఉంటుందనే భావనలో బీజేపీ నేతలున్నట్టు సమాచారం. అయితే, గతంలో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంగిడి మనోహర్‌రెడ్డి గ్రూపుకు సంబంధించిన నేతలు కొంత కాలంగా మౌనంగా ఉన్నారని, కోమటిరెడ్డితో పనిచేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తుంది.
సవాళ్లు, ప్రతి సవాళ్లు
టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లతో మునుగోడు నియోజకవర్గంలోని పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కాంట్రాక్ట్ పనులు ఇస్తే టీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని 300సార్లు కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన దొంగ.. రాజగోపాల్‌రెడ్డి అంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా రూ.20వేల కోట్ల కాంట్రాక్టు పనుల కోసం బీజేపీకి అమ్ముడుపోయినట్టు సాక్ష్యాలున్నాయని ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తెలంగాణ రాకముందు ఇల్లేలేని జగదీశ్‌రెడ్డికి ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బినామీ ఆస్తులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే, రాజగోపాల్‌రెడ్డి పార్టీ ఎందుకు మారుతున్నారో నియోజకవర్గంలో ప్రతి ఓటరు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. ఏ సామాన్య వ్యక్తిని అడిగినా అదే విషయం మాట్లాడుతున్నారంటే బీజేపీకి ఎదురు గాలి తప్పదన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో కీలక నేతలు
ప్రధానంగా మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. అందుకే ఇప్పటికే తీవ్రంగా కసరత్తును మొదలుపెట్టాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి ఇన్చార్జీలను నియమించింది. వారి సారథ్యంలోనే మండలం పరిధిలో సుమారు రెండు వేల మందితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండలానికీ ఇద్దరు పార్టీ నేతలు ఇన్‌చార్జీలుగా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి మండలానికీ ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను కలిపి ఇన్‌చార్జీలుగా నియమించింది. వారంతా గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీ మాత్రం అమిత్‌షా సభ తర్వాత మండలాల్లో మకాం వేసేందుకు సమాయత్తమవుతోంది.