Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలో బీజేపీని ఇంటికి సాగనంపాలి
- సంస్కరణల పేరుతో పేదలకు శఠగోపం
- షావుకార్లకు మాత్రం రూ.10 లక్షల కోట్లు మాఫీ
- ఎట్టి పరిస్థితుల్లోనైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
- రాష్ట్రంలో కొత్తగా మరో 10లక్షల మందికి పింఛన్లు
- వికారాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్
- వికారాబాద్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
- మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ, అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రధాని మోడీయే మనకు ప్రధాన శత్రువుగా మారారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో ఏ ఒక్క మంచి పనైనా చేసిందా అని ప్రశ్నించారు. ఏ ఒక్క వర్గానికి మేలు చేయని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఉజ్వల భారత నిర్మాణంలో మనం భాగస్వాములం కావాలని సీఎం సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల బాధ్యతలు స్వీకరించారు. అలాగే మెడికల్ కాలేజీకి శంకుస్థాపనతోపాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను జిల్లా చేయడంతో పాటు మెడికల్, డిగ్రీ కాలేజీలూ మంజూరు చేశామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో దారుణమైన పాలన చూశామని, రాష్ట్రం వస్తే భూముల ధరలు తగ్గిపోతాయని తప్పుడు ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఆంధ్రా, కర్నాటకలో కంటే తెలంగాణలోనే భూముల ధరలు పెరిగాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 57 ఏండ్లు నిండిన మరో 10లక్షల మందికి నూతన పింఛన్లు అందజేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుతెలిపారు. బీజేపీ జెండాలు చూసి మోసపోవద్దని, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్రంపై విరుచుకుపడ్డ కేసీఆర్
వికారాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఉచితాలను రద్దు చేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచారన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, రూపాయి విలువ మాత్రం దిగజారిందని వాపోయారు. ప్రధాని మోడీ గతంలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని చెప్పి, 15పైసలు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. మాటలతో పేదలకు శఠగోపం పెడుతూ.. షావుకార్లకు మాత్రం రూ.10 లక్షల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు. బోరుబావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. పంద్రాగస్టు సందర్భంలో ఎర్రకోట మీద ప్రధాని మోడీ ఇచ్చిన ప్రసంగంపై కేసీఆర్ సెటైర్లు వేశారు. తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా అని, దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం ఒక్కటే బాగుంటే సరిపోదని, దేశం కూడా బాగుండాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మనమందరం భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
వికారాబాద్ జిల్లాకు జీవనాధారమైన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృష్టా నదిలో రాష్ట్రం వాటా తేెల్చకపోవడం వల్లనే పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధాని మోడీ వద్దకు వెళ్లి కృష్టా జలాల్లో రాష్ట్రం వాటా తీసుకురావాలని సవాల్ చేశారు. పాలమూరు ప్రాజెక్టును బీజేపీకే అడ్డుకుంటోందని, వందల దరఖాస్తులు ఇచ్చిన పట్టించుకోకుండా ప్రధానమంత్రే తెలంగాణకు శత్రువుగా మారారన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. ఎవరెన్ని కిరికిరిలు పెట్టినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి పరిగి, తాండూర్, వికారాబాద్, చేవెళ్ల నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పైలెట్ రోహిత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సురభి వాణిదేవి, కలెక్టర్ నిఖిల, జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.