Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడో తరగతి పాస్, టెన్త్ ఫెయిల్ అయిన వారే అర్హులని నోటిఫికేషన్..
- నకిలీ పత్రాలతో జాబ్
- విచారణ జరిపించాలంటున్న అభ్యర్థులు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో గోల్మాల్ జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నత విద్యార్హత కలిగి ఉన్నారంటూ కొందరు తప్పుడు విద్యా ధ్రువపత్రాలను సమర్పించి ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్నప్పటికీ.. టెన్త్ ఫెయిలయినట్టు అడ్డ దారిలో స్టడీ సర్టిఫికేట్స్ తయారు చేయించి అధికారుల కండ్లుకప్పి ఉద్యోగాల్లో చేరారని ఆరోపిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీపై విచారణ చేయించాలని లేదా రీ వెరిఫికేషన్ చేయించాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. అక్ర మంగా ఉద్యోగాల్లో చేరిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కోర్టుల్లోని ఆఫీస్ సబార్డినేటర్ల భర్తీ కోసం 31-07-2019 తేదీన నోటిఫికేషన్ నెం.9/2019ను హైకోర్టు విడుదల చేసింది. ఇందుకు ఏడో తరగతి లేదా అందుకు సమానమైన అర్హతతో పాటు పదో తరగతి ఫెయిల్ అయిన వారే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. మెదక్ ఉమ్మడి జిల్లాలో 86 పోస్టులుండగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా వారంతా పరీక్షలు రాశారు. ర్యాంక్ సాధించిన వారికి 2021లో నాలుగు దఫాలుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించారు. వారిలో 59 మంది ఎంపికయ్యారు. అయితే అందులో సరైన పత్రాలు, ర్యాంక్ సాధించిన వారు సుమారు 10 మంది మాత్రమే ఉంటారని అభ్యర్థులు చెబుతున్నారు. మిగిలిన వారు తప్పుడు సర్టిఫికేట్స్ సృష్టించి జాబ్లో చేరారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా సెలెక్ట్ అయిన వారు 19-05-2022న ఉద్యోగంలో చేరారు. ఇప్పటికీ 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే భర్తీ అయిన పోస్టుల్లో కూడా మొత్తం ఓపెన్ కోటాలోనే ఉండటం గమనార్హం.
టెన్త్ ఫెయిలయిన వారికి టీఎస్పీఎస్సీలో ఐడీ..?
విచిత్రమేమంటే సబార్డినేట్ పోస్టుల కోసం టెన్త్ ఫెయిల్ అయిన వారే అర్హులు.. అలాంటిది సబార్డినేటర్లుగా ఎంపికైన వారికి టీఎస్పీఎస్సీలో ఐడీ ఉన్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. టెన్త్ ఫెయిలయిన వారు టీఎస్పీఎస్సీలో ఎందుకు రిజిస్టర్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నత విద్యార్హత కలిగిన పలువురు తప్పుడు పత్రాలు సృష్టించారనడానికి ఇదే నిదర్శనమంటున్నారు.